India Women Team: మహిళా క్రికెటర్లకు సంబంధించి బీసీసీఐ కాంట్రాక్ట్ లను ప్రకటించింది. టీమిండియా నుంచి 17 మంది మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్ లు దక్కాయి. అయితే, ఆయా క్రికెటర్లకు చెల్లించే వేతనాల వివరాలు మాత్రం వెల్లడించలేదు. కేవలం 3 గ్రేడులకు సంబంధించి పేర్లు ప్రకటించారు. టీమిండియా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ , వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, ఆల్ రౌండర్ దీప్తి శర్మ గ్రేడ్ ఏ కాంట్రాక్ట్ ను దక్కించుకున్నారు. అయితే ముగ్గురికి మాత్రమే టాప్ గ్రేడ్ ను కేటాయించారు. గత ఏడాది ప్రకారం రూ. 50 లక్షల వార్షిక వేతనంగా ఇచ్చారు.
ఇక, గ్రేడ్ B కాంట్రాక్ట్ లో ప్రస్తుతం 5 గురు ప్లేయర్లు చేరారు. టాప్ పేసర్ రేణుకా సింగ్ , బ్యాటర్లు జెమీమా రోడ్రిగ్స్ , షఫాలీ వర్మ, స్పిన్నర్, రిచా ఘోష్ , గైక్వాడ్ లకు రెండో గ్రేడ్ దక్కింది. బీ గ్రేడ్ లో ఉన్న ప్లేయర్లు రూ. 30 లక్షలు తీసుకున్నారు.
మరో వైపు గ్రేడ్ C కాంట్రాక్ట్‌లోకి బీసీసీఐ తొమ్మిది మంది ప్లేయర్లను ని తీసుకుంది. వీరిలో తెలుగు ప్లేయర్లు సబ్బినేని మేఘన, అంజలి సర్వాని లు చోటు దక్కించుకున్నారు. మిగిలిన వారిలో మేఘ్నా సింగ్, దేవికా వైద్య, పూజా వస్త్రాకర్, స్నేహ్ రాణా, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, యస్తికా భాటియా కాంట్రాక్ట్ లో చోటు దక్కింది.
C గ్రేడ్‌లో ఉన్న వారికి గత ఏడాది బీసీసీఐ రూ. 10 లక్షలను వార్షిక వేతనంగా చెల్లించింది. ఇప్పటికే పురుషులు, మహిళల మ్యాచ్ ఫీజులను సమానంగా చెల్లించాలని బీసీసీఐ అంగీకరించింది. కానీ ప్రస్తుత వేతనాలు మాత్రం ఇరువురి మధ్య తేడాలు ఉన్నాయి. మెన్ క్రికెటర్లలో టాప్ గ్రేడ్ అయిన A+ కేటగిరీ ప్లేయర్లకు రూ. 7 కోట్ల వరకు వేతనం అందుతున్న విషయం తెలిసిందే.