IND vs AUS: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ శుభారంభం చేసింది. లక్ష్య ఛేదనలో మెుదట తడబడిన భారత్.. కేఎల్ రాహుల్ అద్వీతియ పోరాటంతో విజయాన్ని అందుకుంది. మూడు వన్డేల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
స్వల్ప లక్ష్యం ఉన్నప్పటికీ.. (IND vs AUS)
లక్ష్యం చిన్నదే అయినా.. భారత్ తడబడింది. మెుదట్లో వరుస వికెట్లు కోల్పోయిన టీమిండియా.. కేఎల్ రాహుల్ పోరాటంతో విజయాన్ని అందుకుంది.
ఓ దశలో టీమిండియా ఓడిపోతుందని అందరు భావించారు. కానీ చివర్లో.. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ జట్టుతు మరపురాని విజయాన్ని అందించారు. దీంతో ఐదు వికెట్ల తేడాతో.. విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 35.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా ఆరంభంలో తడబాటుకు గురైనప్పటికీ.. కేఎల్ రాహుల్ అర్దశతకం సాధించి భారత్‌ను గెలిపించాడు. రాహుల్‌కు తోడుగా రవీంద్ర జడేజా కీలక పరుగులు సాధించాడు. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే మ్యాచ్ వైజాగ్ వేదికగా మార్చి 19వ తేదీ జరగనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణించిన రవీంద్ర జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
స్టార్క్ మెరుపులకు అడ్డుకట్ట
ఆసీస్‌ను 188 పరుగులకే ఆలౌట్ చేశామనే ఆనందం భారత ఇన్నింగ్స్ ప్రారంభమైన కొంతసేపటికి అభిమానుల్లో ఆవిరైంది.
తొలుత ఓపెనర్ ఇషాన్ కిషన్ (3)ను స్టొయినిస్ ఔట్ చేయగా.. తర్వాత విరాట్ కోహ్లీ (4), సూర్యకుమార్ (0)ను వరుస బంతుల్లో స్టార్క్ ఔట్ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు.
అయితే కుదురుకుని ఆడిన శుభమన్ గిల్ (20)ను కూడా స్టార్క్ ఔట్ చేశాడు. అయితే, హార్దిక్ పాండ్య (25)తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.
కానీ, కీలక సమయంలో హార్దిక్ ఔట్ కావడంతో భారత్ చిక్కుల్లో పడింది. మరో వికెట్ పడితే పరిస్థితి ప్రమాదకరంగా మారేది.
కానీ, జడేజాను టాప్ ఆల్‌రౌండర్ ఎందుకంటారో.. మరోసారి నిరూపించుకున్నాడు. కేఎల్ రాహుల్ – జడేజా ఆరో వికెట్‌కు ఏకంగా 108 పరుగులు జోడించారు.
దీంతో మరో వికెట్ పడనీయకుండా భారత్‌ను గెలిపించారు. ఆసీస్ బౌలర్లు స్టార్క్ 3, స్టొయినిస్ 2 వికెట్లు తీశారు.
మిచెల్ మార్ష్ ఒక్కడే..
మ్యాచ్ ఆరంభంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. దీంతో ఆసీస్ ఓపెనర్ మిచెల్ మార్ష్ (81) దూకుడుగా ఆడాడు.
మరో ఓపెనర్ హెడ్ (5) త్వరగా ఔటైనప్పటికీ స్మిత్‌తో (22) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు.
కానీ, లబుషేన్ (15), జోష్ ఇంగ్లిస్ (26) మినహా ఎవరి నుంచి మద్దతు లభించకపోవడంతో సెంచరీ దిశగా సాగిన మార్ష్ భారీ షాట్లకు యత్నించి పెవిలియన్‌కు చేరాడు.
భారత బౌలర్లలో షమీ 3, సిరాజ్ 3, జడేజా 2.. హార్దిక్, కుల్‌దీప్ చెరో వికెట్ తీశారు.