Site icon Prime9

India vs Australia: భారత్, ఆస్ట్రేలియా కీలక మ్యాచ్.. భారత్ స్కోరు ఎంతంటే?

India vs Australia 5th Test match Day 2: బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదో టెస్ట్ జరుగుతోంది. ప్రస్తుతం భారత్ రెండో ఇన్నింగ్స్ కొనసాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా 181 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ నాలుగు పరుగులు ఆధిక్యం సాధించింది. అదే ఉత్సాహంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. ఓపెనర్ యశస్వీ జైస్వాల్(22) కీలక ఇన్నింగ్స్ ఆడారు. స్టార్క్ వేసిన తొలి ఓవర్‌లోనే జైస్వాల్ 4 ఫోర్లు కొట్టి ఆకట్టుకున్నాడు. అలాగే కేఎల్ రాహుల్(10) నిలకడగా ఆడారు. దీంతో 7 ఓవర్లలో 42 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.

ఆ తర్వాత బోలాండ్ బౌలింగ్‌లో ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ ఔటయ్యారు. స్వల్ప వ్యవధిలో ఇద్దరూ పెవిలియన్ చేరడంతో భారత్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. విరాట్ కోహ్లీ(6) తక్కువ పరుగులే వెనుదిరిగాడు. తన వీక్ నెస్ మరోసారి బయటపడింది. ఆఫ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. ఇక, శుభమన్ గిల్(13) వేగంగా ఆడే ప్రయత్నంలో వికెట్ సమర్పించుకున్నాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(61) కీలక ఇన్నింగ్స్ ఆడారు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. జడేజాతో కలిసి ఐదో వికెట్‌కు 46 రన్స్ చేశారు. ఆ వెంటనే కమిన్స్ బౌలింగ్‌లో పంత్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా.. బోలాండ్ బౌలింగ్ లో నితీశ్(4) ఔట్ అయ్యాడు. భారత్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. ప్రస్తుతం జడేజా(8), సుందర్(6) పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. పాట్ కమిన్స్, వెబ్‌స్టర్ తలో వికెట్ తీశారు.

Exit mobile version