Site icon Prime9

India vs Australia: ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్.. భారత్ లక్ష్యం ఎంతంటే?

India vs Australia 3rd Test Day 5:గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ టెస్ట్‌లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ బౌలర్ల విజృంభణకు రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్‌కు 275 పరుగులు లక్ష్యాన్ని విధించింది.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగుల ఆధిక్యం ఉండగా.. రెండో ఇన్నింగ్స్‌లో 89 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా బ్యాటర్లలో పాట్ కమిన్స్(22) పరుగులు చేయగా.. మిగతా వాళ్లు విఫలమయ్యారు. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించి కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అంతకుముందు డేంజరస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ కూడా సిరాజ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించగా.. గాల్లోకి లేసిన బంతిని వికెట్ కీపర్ రిషభ్ పంత్ రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. మెక్ స్వీని(4), ఖవాజా(8), లాబుస్చాగ్నే(1), మిచెల్ మార్ష్(2), హెడ్(17), స్టీవెన్ స్మిత్(4), అలెక్స్(20), స్టార్క్(2) పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ చెరో రెండు వికెట్లు తీశారు.

అయితే, రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్‌కు మరోసారి వర్షం అంతరాయం ఏర్పడింది. రెండు ఓవర్లు ముగిసే సరికి వర్షం రావడంతో ఆట నిలిచింది. ప్రస్తుతం భారత్ వికెట్ కోల్పోకుండా 8 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైస్వాల్(4), కేఎల్ రాహుల్(4) పరుగులతో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 267 పరుగులు అవసరం ఉంది. కాగా,వర్షం అంతరాయంతో అంపైర్లు టీ బ్రేక్‌ను ముందే ప్రకటించారు.

ఇదిలా ఉండగా, మరో 20 నిమిషాల తర్వాత వర్షం తగ్గితే బ్యాచ్ తిరిగి పున:ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వర్షం అంతరాయం కలిగించకుండా ఉంటే సుమారు 54 ఓవర్ల ఆట ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ తర్వాత కూడా ఇలాగే వర్షం అంతరాయం ఏర్పడితే ఓవర్లు తగ్గవచ్చు.

Exit mobile version