India Vs Sri Lanka: వన్డే ప్రపంచకప్ లో వరుసగా ఆరు మ్యాచులను గెలిచిన భారత్ ఏడవ మ్యాచులో శ్రీలంకపై 302 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ముంబై వాంఖడే స్టేడియంలో భారత పేసర్ల దాటికి చేతులెత్తేసిన శ్రీలంక బ్యాట్స్ మెన్ ఒకరి తరువాత మరొకరు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. దీనితో శ్రీలంక 55 పరుగులకే ఆలౌట్ అయి ఘోరపరాజయాన్ని పొందింది.
భారత్ భారీ స్కోరు .. ( India Vs Sri Lanka)
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 357 పరుగుల భారీ స్కోరు చేసింది. రోహిత్ శర్మ రెండో బంతికే అవుటైనా శుబ్‌మన్ గిల్ 92, విరాట్ కోహ్లీ 88, శ్రేయాస్ అయ్యర్ 82 పరుగులు చేసి స్కోరును పరుగెత్తించారు.కెఎల్ రాహుల్ మాత్రం 12 పరుగులు మాత్రమే చేసి నిరాశపరచాడు. రవీంద్ర జడేజా చివరిలో 24 బంతుల్లో 35 పరుగులు చేసి చివరి బంతికి రనౌట్ అయ్యాడు.
358 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన శ్రీలంక, 14 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది..ఇన్నింగ్స్ మొదటి బంతికి పథుమ్ నిశ్శంకని అవుట్ చేశాడు జస్ప్రిత్ బుమ్రా. తరువాత వరుసగా వికెట్లు పడుతుండటంతో శ్రీలంక బ్యాట్స్ మెన్ ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. దీనితో 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో షమీమ్ 5, సిరాజ్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో భారత్ సెమీస్ కి దూసుకెౌళ్లింది.