Hockey Junior Asia Cup : భారత్ మరోమారు సంచలనం సృష్టించింది. ఆసక్తికరంగా సాగుతున్న హాకీ జూనియర్స్ ఆసియా కప్ లో టైటిల్ కైవసం చేసుకుంది. గురువారం జరిగన ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఇక పోటీ ఏదైనా కానీ భారత్ ప్రత్యర్థిగా పాకిస్థాన్ ఉంటే ఆ ఆట ఇంకా ఏ లెవెల్లో జరుగుతుందో అర్దం చేసుకోవచ్చు. ఫైనల్‌లో కూడా ఈ రెండు జట్లు తలపడగా.. పాకిస్థాన్ జట్టును టీమిండియా చిత్తు చేసింది. ఓమన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మెరుగైన ప్రదర్శనతో అదరగొడుతున్న టీమిండియా మరోసారి ఆసియా కప్‌ని తన ఖాతాలో వేసుకుంది.
డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన భారత్ తరఫున.. ఫైనల్ మ్యాచ్‌లో అంగద్‌బీర్ సింగ్ (13వ నిముషంలో), అరైజీత్ సింగ్ హుండల్ (20వ నిముషంలో) చేరో గోల్ చేయగా.. పాకిస్థాన్ జట్టు నుంచి అలీ బషారత్ (38వ నిముషంలో) ఒక్క గోల్ చేశాడు. దాంతో 2-1 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఇక భారత్‌కి ఆసియా కప్ టైటిల్ గెలవడం ఇది నాల్గొవ సారి అని చెప్పాలి. అంతక ముందు 2004, 2008, 2015 టోర్నీలలో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. టోర్నీ మొత్తంలో భారత్ 50 గోల్స్ సాధించి.. కేవలం నాలుగు గోల్స్‌నే సమర్పించుకుంది.
Congratulation’s to Team India for Winning
Men’s Junior Asia Cup 2023. #mjac2023#WatchHockey#asiahockey pic.twitter.com/QK93NNrdbc— Asian Hockey Federation (@asia_hockey) June 1, 2023
2021లో జరగాల్సిన టోర్నీ కరోనా కారణంగా రద్దవడంతో.. ఈ ఏడాది జరిగిన టోర్నీకి భారత్ డిఫెండింగ్ చాంపియన్ హోదాతో ఆడింది. అదే విధంగా ఈ విజయంతో భారత్ ఖాతాలో ఓ రికార్డు చేరింది. అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్‌ని గెలిచిన జట్టుగా టీమిండియా అవతరించింది. ఈ టోర్నీకి (Hockey Junior Asia Cup) ముందు పాకిస్థాన్ (1988, 1992, 1996), భారత్ (2004, 2008, 2015) చెరో 3 టైటిల్స్‌తో సమానంగా ఉండేవి. కానీ తాజా ట్రోఫీతో పాకిస్థాన్‌ని టీమిండియా వెనక్కి నెట్టి రికార్డు నెలకొల్పింది.
అదే విధంగా ఈ టోర్నీలో మూడో స్థానం కోసం దక్షిణ కొరియా, మలేసియా తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో 2–1 తేడాతో మలేసియాపై దక్షిణ కొరియాపై మలేసియా విజయం సాధించింది. తొలి మూడు స్థానాల్లో నిలిచిన ఈ జట్లు.. ఈ సంవత్సరం డిసెంబర్‌లో మలేషియా కౌలాలంపూర్ వేదికగా జరిగే జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి.