India beat England by 4 wickets in the second ODI: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవరల్లో 304 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జో రూట్(69, 72 బంతుల్లో 6 ఫోర్లు), డకెట్(65, 56 బంతుల్లో 10 ఫోర్లు), లివింగ్ స్టన్(41, 32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. భారత్ బౌలర్లలో జడేజా 3 వికెట్లు పడగొట్టగా.. షమి, హర్షిత్, హార్దిక్, వరుణ్ తలో వికెట్ తీశారు.
భారీ లక్ష్యఛేదనలో భారత్ అదరగొట్టింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(119, 90 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్(60, 52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు భారీ భాగస్వామ్యం అందించారు. భారత్ 136 పరుగుల వద్ద తొలి వికెట్ గిల్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లీ(5) విఫలమయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్(44) రనౌట్ అయ్యాడు. భారత్ బ్యాటర్లలో అక్షర్ పటేల్(41), రాహుల్(10), హార్దిక్(10), జడేజా(11) పరుగులు చేశారు. భారత్ 44.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఓవర్టన్ రెండు వికెట్లు తీయగా.. అట్కిన్సన్, రషీద్, లివింగ్ స్టన్ తలో వికెట్ తీశారు. దీంతో భారత్ 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో సెంచరీ చేసి జట్టు కోసం నిలబడటం సంతోషాన్ని ఇచ్చిందని కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. మ్యాచ్ అనంతరం రోహిత్ మీడియాతో మాట్లాడారు. లక్ష్యఛేదనలో తన బ్యాటింగ్ ఎంజాయ్ చేశానని వెల్లడించారు. బ్యాటింగ్‌కు బరిలో నిల్చున్న సమయంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేలా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రధానంగా ప్రత్యర్థుల విసిరే బంతులను సరిగ్గా అంచనా వేసి సరైన ప్రణాళికలు అమలు చేశానని అన్నారు. కాగా, ఓపెనర్ గిల్ సైతం చాలా క్లాసీ ప్లేయర్ అని రోహిత్ కితాబిచ్చాడు.