India beat England by 4 wickets in Nagpur: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో మూడు వన్డే మ్యాచ్ సిరీస్‌లో భాగంగా తలపడిన తొలి పోరులో భారత్ విజయ దుందుభి మోగించింది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లాండ్ మంచి శుభారంభం చేసింది. ఓపెనర్లు ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. తొలి 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 71 పరుగులు ఉన్న ఇంగ్లాండ్‌ను రనౌట్ రూపంలో దెబ్బ పడింది. సమన్వయ లోపంతో సాల్ట్ రనౌట్ కావడంతో పాటు ఆ తర్వాతి ఓవర్‌లోనే డకెట్(32), బ్రూక్(0) లను హర్షిత్ రాణా ఔట్ చేశాడు. నిలకడగా ఆడుతున్న రూట్(19)ను జడేజా క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఈ దశలో బట్లర్(52), లివింగ్ స్టన్(5)లు కూడా ఔట్ కావడంతో ఇంగ్లాండ్ స్కోరు భారీగా పడిపోయింది. క్రీజులోకి వచ్చిన బెతెల్,ఆర్చర్ కాస్త నిలకడగా ఆడడంతో ఇంగ్లాండ్.. 47.4 ఓవర్లలో 248 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో జడేజా, హర్షిత్ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. షమి, అక్షర్ పటేల్, కుల్ దీప్ తలో వికెట్ తీశారు.
ఇంగ్లాండ్ నిర్ధేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), రోహిత్(2) విఫలమవ్వగా.. తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్(87), అయ్యర్(59)లు కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 94 పరుగులు జోడించారు. కానీ బెతెల్.. అయ్యర్‌ను ఔట్ చేశాడు. దీంతో క్రీజులోకి వచ్చిన అక్షర్ పటేల్(52) కూడా రాణించారు. నాలుగో వికెట్‌కు గిల్, అక్షర్‌లు కలిసి 108 పరుగులు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే చివరిలో అక్షర్, రాహుల్(2), గిల్(87) ఔట్ అయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్(9), జడేజా(12) పరుగులు చేశారు. దీంతో భారత్ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో రషీద్, మహ్మద్ చెరో వికెట్లు తీయగా.. ఆర్చర్, బెతెల్ తలో వికెట్ పడగొట్టారు.