Site icon Prime9

New Zealand: ఉత్కంఠ రేపిన టెస్ట్ మ్యాచ్.. చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్

newzealand

newzealand

New Zealand: ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుని ఇంగ్లాండ్ జట్టుకు షాక్ ఇచ్చింది. రెండు టెస్టుల సిరీస్ ను 1-1 తో సమం చేసింది. ఈ చరిత్రాత్మక గెలుపుతో కివీస్ మరో రికార్డును నమోదు చేసింది.

బజ్‌బాల్‌ క్రికెట్‌ రివర్స్‌..

ఇంగ్లాండ్ జట్టు ఈ మధ్య వన్డే తరహాలోనే టెస్టు మ్యాచులను ఆడుతోంది. నిదానంగా ఆడే ఆటలో.. దూకుడు పెంచి ప్రత్యర్థిని బెంబెలెత్తించే ఆ జట్టుకు న్యూజిలాండ్ గట్టి షాక్ ఇచ్చింది. ఒక్క పరుగు తేడాతో ఆ జట్టును ఓడించి.. చరిత్ర సృష్టించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ ను 1-1 తో సమం చేసింది. బజ్‌బాల్‌ క్రికెట్‌ మంత్రం ఇంగ్లాండ్‌ కే రివర్స్‌ కొట్టింది. రెండో టెస్టు చివరి వరకు ఉత్కంఠగా సాగింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ మ్యాచ్.. టెస్ట్ క్రికెట్ మజాను చూపించింది. కేవలం ఒక్క పరుగు తేడాతో కివీస్ సంచలన విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్‌తో టెస్టు క్రికెట్‌లో విజయం సాధించిన రెండో జట్టుగా న్యూజిలాండ్‌ నిలిచింది. ఈ మ్యాచ్ లో ఇన్నింగ్‌ తేడాతో గెలవాలని అనుకున్న ఇంగ్లాండ్‌ ప్లాన్‌ బెడిసికొట్టింది.

 

తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్‌కు రెండో టెస్టులో కివీష్ షాకిచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. ఫాలోఆన్‌ ఎదుర్కొని మరీ ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. కివీస్‌ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 256 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 435 స్కోర్ చేసింది. ఇక కివీస్‌ తొలి ఇన్నింగ్స్ లో 210 పరుగులకే ఆలౌటైంది. ఫాలో ఆన్ ఆడిన కివీస్.. విలియమ్సన్ 132 పరుగులు.. టామ్‌ బ్లండెల్‌ 90, టామ్‌ లేథమ్ 83 పరుగులతో రాణించారు. కాన్వే 61, డారిల్‌ మిచెల్‌ 54 తమ వంతు సహకారం అందించడంతో.. రెండో ఇన్నింగ్స్‌లో 483 పరుగులు చేసింది.

అదరగొట్టిన కివీస్‌ బౌలర్లు.. (New Zealand)

బజ్‌బాల్‌ క్రికెట్‌ ఆడుతున్న ఇంగ్లాండ్‌కు ఛేదన పెద్ద కష్టమేమీ కాదని అందరు అనుకున్నారు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ కివీస్‌ బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శించారు. ఓవర్‌ నైట్ 48/1 స్కోరుతో ఐదో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లాండ్‌ 256 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు మాజీ కెప్టెన్ జో రూట్‌ 95 పరుగులతో ఒక్కడే రాణించాడు. కివీస్ బౌలర్లలో నీల్ వాగ్నెర్ 4, టిమ్ సౌథీ 3, మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీశారు. ఇంగ్లాండ్‌ సూపర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ రనౌట్ రూపంలో వెనుదిరగడం ఆ జట్టు విజయవకాశాలు దెబ్బతిన్నాయి.

మూడో జట్టుగా కివీస్‌ రికార్డ్..

టెస్టు క్రికెట్ లో ఫాలో ఆన్ ఆడి గెలవడం చాలా కష్టం. అలాంటిది న్యూజిలాండ్ రెండో టెస్టులో విజయం సాధించింది. ఇలా విజయం సాధించిన మూడో జట్టుగా కివీస్ రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు కేవలం రెండు జట్లు మాత్రమే ఇలా గెలిచాయి. ఇందులో ఇంగ్లాండ్‌ ఒకటి కాగా.. రెండోది టీమిండియానే. ఇంగ్లాండ్‌ 1894, 1981లో ఆసీస్‌పై ఇలానే గెలిచింది. ఇక భారత్‌ కూడా 2001లో ఆస్ట్రేలియాపైనే విజయం సాధించడం గమనార్హం. ఇప్పుడు కివీస్‌ అద్భుతంగా ఆడి మరీ ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. 1993లో ఆసీస్ తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వెస్టిండీస్‌ ఒక్క పరుగు తేడాతో విజయాన్ని అందుకుంది. తాజాగా 30 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్‌ తో మ్యాచ్‌లో కివీస్‌ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అతి తక్కువ మార్జిన్‌తో విజయం సాధించిన జాబితాలో విండీస్‌తో సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచింది కివీస్‌.

Exit mobile version