Ind vs Aus 4th test: అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు అదరగొట్టారు. భారత్ 91 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ, శుభ్ మన్ గిల్ రాణించారు.
ఆధిక్యంలోకి వెళ్లిన టీమిండియా.. (Ind vs Aus 4th test)
బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో భాగంగా నాలుగో టెస్టులో ఆసీస్‌పై భారత్ పై చేయి సాధించింది. విరాట్ కోహ్లీ 186 పరుగులతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ అయింది. కంగారు జట్టు తన తొలి ఇన్నింగ్స్ లో 480 పరుగులు చేసింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో భారత్ 91 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. క్రీజ్‌లో కునెమన్, ట్రావిస్ హెడ్ ఉన్నారు. ఆసీస్ 88 పరుగుల వెనుకంజలో ఉంది. ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన ఆసీస్ స్టార్ ఆటగాడు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా బ్యాటింగ్ కు రాలేదు.
డబుల్ కి చేరువలో వచ్చిన విరాట్..
భారత్ తొలి ఇన్నింగ్స్ లో విరాట్ రాణించాడు. దాదాపు మూడెళ్ల తర్వాత సెంచరీ సాధించాడు. ఆసీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించాడు. ద్విశతకం వైపు సాగిన విరాట్ ను ఆసీస్ బౌలర్లు పెవిలియన్ కు పంపారు. తొలి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ మిస్ అయినప్పటికీ అభిమానుల మనస్సు గెలుచుకున్నాడు విరాట్. ఇదే మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 128 పరుగులతో రాణించాడు. చివర్లో అక్షర్ పటెల్ 79 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ లయన్, టాడ్ మర్ఫీ మూడేసి వికెట్లు పడగొట్టారు.
చివరి రోజు ఉత్కంఠ..
ఐదో రోజు ఆట మరింత ఉత్కంఠగా మారనుంది. ప్రస్తుతం భారత్ కు 88 పరుగుల ఆధిక్యం ఉంది. చివరి రోజు ఆసీస్ ను ఎంత త్వరగా ఔట్ చేయగలిగితే.. అంత త్వరగా టీమిండియా విజయం సాధించే అవకాశం ఉంటుంది. కంగారు జట్టును 150 లోపే కట్టడి చేస్తే.. భారత్ విజయం సాధించడం తేలిక అవుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే.. శ్రీలంక జట్టుతో సంబంధం లేకుండా టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు టీమ్‌ఇండియా చేరుతుంది.
శ్రేయస్‌కు గాయం..
నడుము నొప్పి ఎక్కువ కావడంతో.. శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు కూడా దిగలేకపోయాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లను కోల్పోయినప్పటికీ ఆలౌట్‌గా పరిగణించాల్సి వచ్చింది. ఇదే మ్యాచ్‌తోపాటు ఆసీస్‌తో వన్డే సిరీస్‌కూ శ్రేయస్ ఆడటం కష్టమే. అతడి స్థానంలో కేఎల్ రాహుల్ ఫీల్డింగ్‌కు వచ్చాడు.
మూడున్నరేళ్ల తర్వాత కోహ్లీ శతకం..
నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ ఎట్టకేలకు సెంచరీ దాహాన్ని తీర్చుకున్నాడు. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో.. నాలుగో రోజు శతకం బాదాడు. విరాట్ దాదాపు 1200 రోజుల నుంచి టెస్టుల్లో సెంచరీ కోసం వేచి చూస్తున్నాడు. 1200 రోజుల నీరిక్షణకు నేడు తెరపడింది. వన్డేలు, టీ20ల్లో సెంచరీలతో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో మాత్రం మూడంకెల స్కోరు కోసం దాదాపు మూడున్నరేళ్లపాటు వేచి చూడాల్సి వచ్చింది. టెస్టుల్లో విరాట్‌కిది 28వ శతకం కాగా.. అన్ని ఫార్మాట్లలో కలిసి మొత్తంగా 75 సెంచరీలు సాధించాడు. కోహ్లీ 241బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. విరాట్ 2019 నవంబర్ 22న బంగ్లాదేశ్ పై చివరిసారిగా టెస్టు శతకం సాధించాడు.