T20 series :ఆసియాకప్ పరాభవం తర్వాత భారత జట్టు మరో టీ20 సిరీస్ కు సిద్దం అయ్యింది. ఆస్ట్రేలియాతో నేటి నుంచి మూడు మ్యాచ్‌లకు తెర లేవనుంది. మొహాలీ వేదికగా రాత్రి ఏడుగంటలకు తొలి మ్యాచ్ జరుగనుంది. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉన్న భారత జట్టు ఈ సిరీస్ ను ఆత్మవిశ్వాసంతో ఆరంభించాలనుకుంటోంది. అలాగే జట్టులోని సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు సరైన కాంబినేషన్‌ను రూపొందించుకునే ఆలోచనలో ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటికి 23 మ్యాచ్‌లు జరగ్గా భారత్ 13, ఆసీస్ 9 మ్యాచ్‌లను గెలిచింది. ఒకదాంట్లో ఫలితం రాలేదు.
ఆసియాక్‌పలో భారత బ్యాటింగ్ ఫర్వాలేదనిపించినా మితిమీరిన ప్రయోగాలు బెడిసికొట్టాయి. అలాగే బౌలింగ్‌లో బలహీనత కనిపించింది. కానీ ఈ సిరీస్ కు స్టార్ పేసర్లు బుమ్రా, హర్షల్‌ల రాకతో ఈ విభాగం బలం పుంజుకుంది. మెగా టోర్నీలో తనతోపాటు రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని కెప్టెన్ రోహిత్ చెప్పగా.. ఈ సిరీస్ లో మాత్రం కోహ్లీని పరీక్షించే అవకాశం లేకపోలేదు. తన చివరి మ్యాచ్‌లో శతకం బాదిన కోహ్లీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. అలాగే రాహుల్ స్లో బ్యాటింగ్ తో విమర్శల పాలవుతున్నాడు. టాప్-4లో ఇబ్బంది లేకున్నా.. ఆ తర్వాత 5,6,7 స్థానాలపైనే తర్జనభర్జన సాగుతోంది.
ఇక హార్దిక్ ఆరో స్థానంలో రావడం పక్కా కాగా, పంత్-దినేశ్ కార్తీక్‌లలో ఎవరిని ఆడించాలనేదే సవాల్‌గా మారింది. అయితే జడేజా గైర్హాజరు కారణంగా పంత్ ఏకైక లెఫ్ట్ హ్యాండర్ కాగా.. ఫినిషర్‌గా డీకే ప్రభావం చెప్పాల్సిన పని లేదు. అలాగే అక్షర్, దీపక్ హుడాపైనా స్పష్టతకు రావాల్సి ఉంది. ఆసియా కప్ సూపర్-4లో అన్ని మ్యాచ్‌లు ఆడినా హుడా ప్రభావం చూపలేదు. జడ్డూ గాయంతో ఆసియాక్‌పలో బౌలింగ్‌పై పెద్ద దెబ్బ పడింది. దీంతో ఐదుగురు బౌలర్లతోనే ఆడాల్సి వచ్చింది. హార్దిక్, అక్షర్ ఇద్దరినీ ఆడిస్తే జట్టుకు ఆరో బౌలర్ ఆప్షన్ ఉంటుంది. అప్పుడు అక్షర్, చాహల్ స్పిన్నర్లుగా.. బుమ్రా, భువనేశ్వర్, హర్షల్, పాండ్యా పేసర్లుగా ప్రత్యర్థిని కట్టడి చేయవచ్చు.
ఇక ఆసీస్ విషయానికి వస్తే కీలక ఆటగాళ్లు లేకుండానే ఆసీస్ జట్టు భారత్ వచ్చింది. ఓపెనర్ వార్నర్‌కు విశ్రాంతినివ్వగా పేసర్లు స్టార్క్, స్టొయినిస్, మార్ష్‌కు గాయాలయ్యాయి. కెప్టెన్ ఫించ్ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవలే వన్డేలకు గుడ్‌బై చెప్పిన అతడు ఈ సిరీస్‌తో ఆత్మ విశ్వాసం నింపుకోవాలనుకుంటున్నాడు. ఇక, డాషింగ్ బ్యాటర్ టిమ్ డేవిడ్ అరంగేట్రానికి ఎదురుచూస్తున్నాడు. విదేశీ లీగ్‌ల్లో భారీ షాట్లతో విరుచుకుపడే టిమ్‌తో భారత బౌలర్లు జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండు మెగా జట్లు పోటీ పడుతుండటంతో అభిమానులకు పరుగుల పండగ చేసుకోనున్నారు.