Site icon Prime9

IND vs WI: విండీస్ పై విరుచుకుపడిన అశ్విన్.. ఆ విష‌యంలో మ‌నం త‌ప్పు చేశామా..? ఆకాశ్ చోప్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

IND vs WI

IND vs WI

IND vs WI: వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో ర‌విచంద్ర‌న్ అశ్విన్ అద‌ర‌గొడుతున్నాడు. మొద‌టి రోజే విండీస్ బ్యాటర్లపై విడుచుకుపడ్డాడు. ఏకంగా 5 వికెట్లు ప‌డ‌గొట్టి వెస్టిండీస్ ప‌త‌నాన్ని అశ్విన్ శాసించాడు. ఓపెన‌ర్లుగా దిగిన ట‌గ్‌న‌రైన్ చంద్ర పాల్(12), బ్రాత్ వైట్‌(20) లతో పాటు అలిక్ అథ‌నాజ్‌(47), అల్జారీ జోసెఫ్‌(4), వారిక‌న్‌(1)ల‌ను వెనువెంటనే పెవిలియ‌న్‌కు చేర్చడంలో అశ్విన్ విజయం సాధించాడు. దీనితో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. ఈ తరుణంలోనే అశ్విన్ పై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

లండ‌న్‌లోని ఓవ‌ల్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌ ఫైన‌ల్ మ్యాచ్‌లో అశ్విన్ కు చోటుదక్కకపోవడాన్ని ఈ సందర్భంగా పలువురు చర్చలోకి తీసుకువచ్చారు. టెస్టుల్లో నంబ‌ర్‌ వ‌న్ ర్యాంక్ బౌల‌ర్‌గా ఉన్న ర‌విచంద్ర‌న్ అశ్విన్‌కు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌ని సంగ‌తి తెలిసిందే. దానితో ఆ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘోర ఓట‌మిని చవిచూసింది. కాగా అశ్విన్ ఫైనల్ మ్యాచ్ లో జ‌ట్టులో ఉండి ఉంటే ఫ‌లితం వేరేలా ఉండేదని పలువురు మాజీల అభిప్రాయం.

మనమేమైనా తప్పు చేశామా(IND vs WI)

అయితే తాజాగా అశ్విన్ వెస్టిండీస్ పై విరుచుకుపడిన ప్ర‌ద‌ర్శ‌న‌ను ఉద్దేశించి మాజీ క్రికెట‌ర్ ఆకాశ్ చోప్రా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు త‌న‌ను దూరంగా ఉంచ‌డం ద్వారా మేనేజ్‌మెంట్ ఎంత పెద్ద త‌ప్పుచేసిందో గ్ర‌హించేలా అశ్విన్ చేశాడ‌ని ఆశాక్ చోప్రా అభిప్రాయపడ్డారు. త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో మాట్లాడుతూ.. “టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంచుకుని మొద‌టి ఇన్నింగ్స్‌లో 150 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. కాగా సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఐదు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ మ్యాచ్‌లో అశ్విన్‌ను ఆడించ‌కుండా మ‌నం పెద్ద త‌ప్పు చేశామా అనే ఫీలింగ్ క‌లిగేలా చేశాడు.” అని ఆయన చెప్పుకొచ్చారు.

సాధార‌ణంగా వెస్టిండీస్ పిచ్‌లు స్పిన్న‌ర్ల‌కు చాలా అనుకూలంగానే ఉంటాయని తెలిపారు. ఈ సిరీస్‌లో అశ్విన్ ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలుస్తాడ‌ని ధీమా వ్యక్తం చేశాడు. అయితే తాను మొద‌టి రోజు చూపిన ప్రతిభను ప్ర‌ద‌ర్శ‌న‌నే రాబోయే అన్ని మ్యాచ్ లలోనూ చూపితే అతను ఖచ్చితంగా ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్‌ టైటిల్ దక్కించుకుంటాని ఆశాభావం వ్యక్తం చేశాడు.

Exit mobile version