1983 World Cup: అది 1983, జూన్ 25.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ సంచలనం సృష్టించిన రోజు. పసికూన అంటూ తీసిపారేసిన జట్టు ఫైనల్ కు చేరి వరుస విజయాలతో రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచిన వెస్టిండీస్ జట్టును మట్టికరిపిస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ స్టేడియంలో ఈ ఫైనల్ మ్యాచ్‌కు వేదిక అయ్యింది. చివరకు ఓటమి ఎరుగని వెస్టిండీస్ జట్టుకు ఓటమిని రుచిచూపిస్తూ కపిల్ డెవిల్స్ లార్డ్స్ బాల్కనీ నుంచి ప్రపంచకప్ ట్రోఫీని తీసుకోవడం ఎవ్వరూ మరిచిపోయి ఉండరు. ఈ విజయం భారత క్రికెట్ చరిత్ర గతిని మార్చేసి నేటికి సరిగ్గా 40 ఏళ్లు.
ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ 54.4 ఓవర్లలో 183 రన్స్ కే ఆలౌటైంది. ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ (38), మొహిందర్ అమర్‌నాథ్ (26), సందీప్ పాటిల్ (27) లు మాత్రమే రాణించగా మిగిలిన వారు బ్యాటింగ్ లో అంతగా రాణించలేకపోయారు. చాలా తక్కువ స్కోరుకే టీమ్ఇండియా ఆలౌట్ అవడంతో అందరూ వెస్టిండీస్ విజయం ఖాయమని భావించారు. సంబరాలు కూడా మొదలుపెట్టేశారు. సరిగ్గా ఇదే సమయంలో భారత్ విరుచుకుపడింది. బ్యాటింగ్‌లో విఫలమైన భారత్ బౌలింగ్‌లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన కనపరిచింది. వివ్ రిచర్డ్స్(33), గ్రీనిడ్జ్(1), హేన్స్(13), సర్ క్లైవ్ లాయిడ్(8) వంటి హేమాహేమీ బ్యాటర్లను తక్కువ స్కోర్ కే కట్టడి చేసింది. దానితో వెస్టిండీస్ జట్టు 52 ఓవర్లలో 140 పరుగులకే ఆలౌటైంది. మొహిందర్ అమర్‌నాథ్, మదన్ లాల్ లు చెరో మూడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించారు. ఇలా ఈ విజయం భారత క్రికెట్ గతిని పూర్తిగా మార్చేసింది. దేశంలో క్రికెట్‌కు ఈ విజయం తర్వాత ఆదరణ బాగా పెరిగింది.
ఇకపోతే భారత జట్టు మొదటి సారి ప్రపంచకప్ గెలిచి నేటికి 40 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆనాటి హీరోలు మళ్లీ ఒక్కచోట చేరి సంబరాలు జరుపుకోనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సునీల్ గవాస్కర్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ ఫోటోలో కపిల్ దేవ్, శ్రీకాంత్, మదన్ లాల్, దిలీప్ వెంగ్ సర్కార్, సందీప్ పాటిల్, అమర్‌నాథ్, మదన్ లాల్, సయ్యద్ కిర్మాణి, బల్విందర్ సింగ్, రోజర్ బిన్నీలతో పాటు అప్పటి టీమ్ మేనేజర్ మాన్‌సింగ్ కూడా ఉన్నారు. కాగా.. ఈ జట్టులో భాగమైన యశ్‌పాల్ శర్మ రెండు సంవత్సరాల క్రితం చనిపోయారు.