Australia Womens: మహిళల క్రికెట్ లో ఆస్ట్రేలియా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే ఐదు వరల్డ్ కప్ లు సాధించిన ఆ జట్టు.. తాజాగా ఆరో ఐసీసీ ట్రోఫిని గెలుచుకుంది. దీంతో మహిళ కంగారుల జట్టుకు ఎదురులేదని మరోసారి రుజువైంది. మహిళల క్రికెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
కంగారూలకు ఆరో మహిళల టీ20 ప్రపంచకప్ (Australia Womens)
మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. టీ20 మహిళల ప్రపంచ్ కప్ ని కంగారు జట్టు సొంతం చేసుకుంది. ఇప్పటికే ఏడు మహిళల టీ20 ప్రపంచకప్పుల్లో అయిదు తన ఖాతాలో వేసుకున్న కంగారు జట్టు.. ఈ మెగా టోర్నీలో టైటిళ్ల సిక్సర్ కొట్టింది. బ్యాటుతో మూనీ.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గార్డ్‌నర్ అదరగొట్టిన వేళ.. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి ఆరోసారి ట్రోఫీని ముద్దాడింది. దక్షిణాఫ్రికా అవకాశాన్ని సృష్టించుకున్నా.. తన కన్నా బలమైన ఆసీస్ ముందు తలవంచక తప్పలేదు. లారా వోల్వార్ట్ గొప్పగా పోరాడినా జట్టును గెలిపించలేకపోయింది.
మంచి స్కోర్ సాధించిన ఆస్ట్రేలియా..
ఫైనల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ విజయాన్ని అందుకుంది. మరోసారి మహిళల మేటి జట్టుగా.. తన ఆధిపత్యాన్ని చాటుకుంది. బెత్ మూనీ 74 పరుగులతో ఆసీస్ కు భారీ స్కోర్ అందించింది. 9 ఫోర్లు.. ఒక సిక్సర్ తో జట్టుకు విజయాన్ని అందించింది. దీంతో ఫైనల్లో 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను కంగారు జట్టు ఓడించింది. ఛేదనలో దక్షిణాఫ్రికా మంచి ప్రయత్నమే చేసినా.. విజయాన్ని అందుకోలేకపోయారు. మొదట ఆసీస్ 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఇక దక్షిణాఫ్రికా ఓపెనర్.. లారా వోల్వార్ట్ 61 పరుగలు చేసిన జట్టును గెలిపించలేకపోయింది. ఆసీస్ ప్లేయర్.. మూనీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఆష్లీ గార్డ్‌నర్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచింది.
పోరాడి ఓడిన దక్షిణాఫ్రికా..
ఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. ఓపెనర్ లారా వొల్వార్ట్ మినహా పెద్దగా ఏ ఒక్కరు రాణించలేదు. లారా కు సరైన సహకారం అందకపోవడంతో.. ఆతిథ్య జట్టుకు ఓటమి తప్పలేదు. క్రమంగా వికెట్లు కోల్పోతున్న దశలో.. లారా గేర్ మార్చింది. చకచకా ఫోర్లు, సిక్స్‌లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో ఆసీస్ శిబిరంలో కలవరం మెుదలైంది. చివరి అయిదు ఓవర్లలో దక్షిణాఫ్రికా 59 పరుగులు చేయాల్సిన పరిస్థితి. లారా దూకుడు చూస్తుంటే జట్టును గెలిపిస్తుందనిపించింది. కానీ 16వ ఓవర్లో గార్డ్‌నర్ ఆరు పరుగులే ఇవ్వగా.. తర్వాతి ఓవర్లో లారాను ఔట్ చేయడం ద్వారా దక్షిణాఫ్రికా ఆశలపై మెగాన్ షట్ నీళ్లు చల్లింది. ఆ తర్వాత ఆసీస్ బౌలర్లు దక్షిణాఫ్రికాకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బ్యాటర్లకు కళ్లెం వేశారు.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ బెత్ మూనీ ఇన్నింగ్సే హైలైట్. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న కంగారు జట్టు.. ఓపెనర్ అలీసా హీలీ (18) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. ఏడు ఓవర్లు ముగిసే సరికి ఆసీస్ స్కోరు 41 పరుగులే. అప్పటికి మూనీ 18 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసింది. క్రమంగా దూకుడు పెంచిన ఆమె చక్కని షాట్లతో అలరించింది. దీంతో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. 2009లో తొలి టీ20 ప్రపంచకప్‌లో మాత్రమే సెమీస్ చేరలేకపోయిన ఆసీస్.. తర్వాత ప్రతి టోర్నీలో ఫైనల్ చేరింది. 2016లో వెస్టిండీస్ చేతిలో ఓడిన కంగారూలు.. 2010లో న్యూజిలాండ్‌ను.. 2012, 2014, 2018ల్లో ఇంగ్లాండ్‌ను.. 2020లో భారత్‌ను ఓడించి కప్పు సాధించారు.