Australia vs India test match india avoids follow on in gabba test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాబా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు ఫాలో ఆన్ గండం తప్పింది. ఈ మ్యాచ్‌లో భాగంగా నాలుగో రోజు వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆట ముగిసినట్లు ప్రకటించారు. అంతకుముందు భారత్ ఓవర్ నైట్ స్కోరు 51 పరుగులకు 4 వికెట్లతో బ్యాటింగ్ ప్రారంభించింది. అయితే వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించడంతో ఇబ్బంది నెలకొంది.
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. భారత్ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(84), రవీంద్ర జడేజా(77) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివరగా ఆకాశ్ దీప్(27) పరుగులు చేశాడు. దీంతో ఫాలో ఆన్ గండం తప్పింది. అయితే భారత్ ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది. ఇక, నాలుగో రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్ కీలక వికెట్లను ప్రారంభంలోనే కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ(10) పరుగులకే ఔట్ అయ్యాడు. కమిన్స్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ పేలవమైన షాట్ ఆడేందుకు ప్రయత్నించి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా నిలకడగా ఆడారు. కేఎల్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. వీరిద్దరి కీలక భాగస్వామ్యంను లియోన్ దెబ్బతీశాడు. నితీశ్(16), సిరాజ్(1) విఫలమయ్యారు. ప్రస్తుతం బుమ్రా(10), ఆకాశ్ దీప్(27) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్ 4 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్ 3, హేజెల్ వుడ్, నాథన్ లియోన్ తలో వికెట్ తీశారు.