WTC Final: బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో భాగంగా మూడో టెస్టులో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్ లో తొమ్మిది వికెట్ల తేడాతో ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. ఇక మూడో టెస్టు గెలుపుతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోకి ఆస్ట్రేలియా దూసుకెళ్లింది. టీమిండియా ఫైనల్ కి వెళ్లాలంటే ఈ సమీకరణాలు జరగాల్సి ఉంది.
అదే జరిగితే టీమిండియాకు కష్టమే!? అయితే.. (WTC Final)
ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దీంతో ఆ జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. దీంతో జూన్ 7న ఇంగ్లండ్ వేదికగా జరగనున్న ఫైనల్లో భారత్ లేదా శ్రీలంకతో తలపడనుంది. మరోవైపు 10 విజయాలతో రెండో స్థానంలో టీమిండియా కొనసాగుతుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా జరగనున్న నాలుగో టెస్టులో గెలిచినా, కనీసం డ్రా చేసుకున్నా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ నాలుగో టెస్టులో ఓడితే మాత్రం భారత్ ఫైనల్ అవకాశాలు దెబ్బతింటాయి. దీంతో అప్పుడు టీమిండియా భవితవ్యం శ్రీలంక ఆటపై ఆధారపడి ఉంటుంది. ఈ నెలలో శ్రీలంక న్యూజిలాండ్ జట్టుతో రెండు మ్యాచులు ఆడనుంది. ఇప్పటికే ఆ జట్టు న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. ఈ సిరీస్ లో శ్రీలంక న్యూజిలాండ్ ను రెండు మ్యాచుల్లో ఓడిస్తే.. ఆస్ట్రేలియా, లంక మధ్య టెస్టు ప్రపంచ కప్ జరగనుంది. శ్రీలంక ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి, మరో టెస్టు డ్రాగా ముగిసినా.. భారత జట్టు విన్నింగ్ శాతం పరంగా ఫైనల్‌కు క్వాలిఫై అవుతుంది.
ఫామ్ లో లేని లంక జట్టు..
ప్రస్తుత టెస్టు మ్యాచుల్లో శ్రీలంక ఫామ్ అంత గొప్పగా ఏం లేదు. దీంతో శ్రీలంకను ఓడించడం న్యూజిలాండ్‌కు పెద్ద సవాల్ కాకపోవచ్చు. ఈ పరిస్థితులను బట్టి చూస్తే.. ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత జట్లు తలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాగా తొలి టెస్టు ఛాంపియన్ షిప్‌ను కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు కోహ్లి సేన రన్నరప్‌గా నిలిచింది. ప్రస్తుతం పాయింట్ల పరంగా.. ఆసీస్ 68.52 పర్సేంటేజీతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత టీమ్‌ఇండియా 60.29 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. శ్రీలంక 53.33, దక్షిణాఫ్రికా 52.38 ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. శ్రీలంక న్యూజిలాండ్ తో ఒక్క మ్యాచ్ ఓడిపోయిన సరే.. భారత్ ముందంజ వేయడం ఖాయం. అ
మూడు రోజుల్లో ముగిసిన మ్యాచ్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో ఏ మ్యాచ్ కూడా మూడు రోజులకు మించి జరగడం లేదు. మెుదటి రెండు మ్యాచులు మూడు రోజుల్లోనే ముగియగా.. తాజాగా మూడో టెస్టు కూడా ముచ్చటగా మూడు రోజుల్లోనే ముగిసింది. ఇక మెుదటి రెండు ఇన్నింగ్స్ లలో టీమిండియా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఆసీస్ ముందు నిర్ధేశించిన లక్ష్యం చిన్నదే కావడంతో.. ఆసీస్ జట్టు అలవోకగా విజయాన్ని అందుకుంది. దీంతో భారత్‌ఫై ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 76 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది. ఇక చివరి టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా ప్రారంభం కానుంది.