Site icon Prime9

Rishi Sunak: బ్రిటన్‌లో అత్యధిక ద్రవ్యోల్బణం.. రిషి సునాక్ కు కత్తిమీద సామే..

Britain

Britain

Prime9Special: బ్రిటన్‌ రాజకీయ అస్థిరతకు తెరపడింది. ప్రధానమంత్రిగా రిషి సునాక్‌ నియమితులయ్యారు. అయితే ప్రస్తుతం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమనేది ఆయనకు కత్తి మీద సాములాంటిదేనని నిపుణులు భావిస్తున్నారు. బ్రిటన్‌లో జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఇక్కడి 24 మిలియన్‌ ప్రజలు ఇళ్లలో ఇంధన వినియోగాన్ని తగ్గించుకుంటున్నారు. 16 మిలియన్‌ ప్రజలు ఆహారంతో పాటు నిత్యావసరాల్లో కోత విధించుకుంటున్నారు. అయితే దీని ప్రభావం స్థానికంగా ఎలా ఉన్నా పలు దేశాల నుంచి వలస వచ్చిన వారు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా అధ్యయనంలో కూడా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ధరలు ఏకంగా 3.3 రెట్లు పెరిగిపోయాయని చెబుతున్నారు. ఇక్కడి తెల్లవారితో పోల్చుకుంటే శ్వేతజాతీయేతరుల పరిస్థితి మాత్రం ఘోరంగా ఉంది.

ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడంతో బ్రిటన్‌లో 26 శాతం ప్రజలు అత్యధిక పేదరికంలో మగ్గుతున్నారు. 50 శాతం మంది దారిద్ర్యరేఖకు దిగవన ఉన్నారు. వీరంతా మైనారిటీలు ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారు. 2021 నుంచి బ్రిటన్‌లో అత్యధిక ద్రవ్యోల్బణం, పన్నుల పెంపు, చుక్కలనంటిన ఎనర్జీ బిల్లుతో బ్రిటన్‌ ఆమ్‌ ఆద్మీ సతమతమవుతున్నాడు. ఒక వైపు అధిక ద్రవ్యోల్బణం జీవన వ్యయం విపరీగంగా పెరిగిపోవడం. అదే సమయంలో ఆదాయం పెరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆహారం, ఎలక్ర్టిసిటి, ఇంధన ధరలు అదుపు తప్పాయి. స్థిరంగా ఆదాయం వచ్చే వారి పరిస్థితి కూడా దారుణంగా తయారైంది. వారం వారం గ్రాసరి బిల్లును కిరాణా బిల్లు తీసుకుంటే అవి కూడా తప్పనిసరిగా ఇంటికి కావాల్సినవి ఉదాహరణకు మాంసం, పాలు, పెరుగులాంటివి ఇక్కడ సామాన్యుడికి అందుబాటులోకి లేకుండా పోయాయి. వచ్చే జీతం ఏ మూలకు సరిపోవడం లేదని.. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని బ్రిటన్‌లో సామాన్యుడు వాపోతున్నాడు. సాధారణంగా నెల వారి గ్రాసరి ఖర్చులు, ముఖ్యంగా మాంసం, పాలు, పెరుగు కోసం నెలకు 200 పౌండ్లు వ్యయం అయితే ప్రస్తుతం 300 బ్రిటిష్‌ పౌండ్లు వ్యయం అవుతున్నాయి. గ్యాస్‌ బిల్లు నెలకు 60 పౌండ్లు అయితే ప్రస్తుతం 158 పౌండ్లు. రాబోయే శీతాకాలం కాబట్టి ఇది కాస్తా 200 పౌండ్లకు చేరవచ్చునని అంచనా వేస్తున్నారు.

జీవన వ్యయం ఇంతగా పెరిగిపోతుంటే ఎలా బతకాలని సామాన్యుడు అడుగుతున్నాడు. ఇంటి అద్దెలు, అలాగే ఇంటి కోసం లేదా దుకాణాల కోసం తీసుకున్న రుణాలపై వడ్డీలు ఎలా కట్టాలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. బర్మింగ్‌ హామ్‌లో గత రెండు దశాబ్దాలుగా నివసిస్తున్న ఒక గృహిణి పెరిగిపోతున్న జీవన వ్యయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గత రెండు దశాబ్దాల కాలంలో ఈ స్థాయిలో ధరలు పెరగలేదని ఆమె అన్నారు. కరోనా మహమ్మారి తర్వాత లాక్‌డౌన్‌ అటు తర్వాత ప్రభుత్వం అమాంతంగా ఆహారం , ఇంధన ధరలు పెంచడం తమకు షాక్‌కు గురి చేసిందని చెబుతున్నారు. ఇది తన ఒక్కరి వేదన కాదని దాదాపు మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఇంతేనని ఆమె అన్నారు.2008లో ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడింది. అప్పటికి ఇప్పటి ధరల్లో పగలు, రాత్రంతా వ్యత్యాసం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఆహారం, ఇంధనల చార్జీలు భరించలేకుండా ఉన్నామని సగటు బ్రిటిషర్‌ వాపోతున్నాడు. వారానికి ఇంటికి కావాల్సిన కిరాణ బిల్లు 80 పౌండ్లు వ్యం అయితే ప్రస్తుతం 150 పౌండ్లు చెల్లించాల్సి వస్తోందని గృహిణి అన్నారు. ఆ బడ్జెట్‌ హాయిగా గడిచిపోయేది ప్రస్తుతం ధరలు నిత్యావసర సరకుల ధరలు పెరిగిపోవడంతో ఒకటి రెండు సార్లు ఆలోచించి కొనుగోలు చేయాల్సి వస్తోందన్నారు. చలికి ఇంట్లో హీటింగ్‌ సిస్టమ్‌ను వినియోగించడం లేదని ఆమె చెప్పారు. ఏ వస్తువు కొనుగోలు చేయాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తోందని గృహిణులు చెబుతున్నారు.

బ్రిటన్‌ ఇండియా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వలసవచ్చిన వారుపెరిగిపోతున్న నిత్యావసర ధరలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక వైపు బ్రిటన్‌లో రాజకీయ సర్కస్‌ కొనసాగుతోందని, కొత్తగా ప్రధానమంత్రి రిషి సునాక్‌ పదవీ బాధ్యతలు చేపట్టినా తమ జీవితాలు మెరుగుపడే పరిస్థితి లేదని వారు దృడాభిప్రాయంతో ఉన్నారు. పరిస్థితులు ఇలానే ఉంటే బ్రిటన్‌ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లడమే మేలని స్థాయికి చాలా మంది వచ్చారు. ప్రస్తుతం బ్రిటన్‌ ప్రజల పరిస్థితులు మాత్రం దుర్భరంగా ఉన్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా బ్రిటన్‌లో ఉద్యోగుల వేతనాలు పెరగకపోవడం. అదే సమయంలో నిత్యావసర ధరలు పెరిగిపోవడంతో మాతృదేశంలో ఉన్న తమ తల్లిదండ్రులకు నెల నెల పంపే డబ్బును బాగా తగ్గించేశారు. నెలకు వంద పౌండ్లు పంపించే వాడినని ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో 60 పౌండ్లకు తగ్గించానని బ్రిటన్‌కు వలస వచ్చిన ఓ మధ్య తరగతి యువకుడు చెప్పాడు. మరి రిషి సునాక్‌ కాలంలోనైనా పరిస్థితులు కుదటపడతాయోమో వేచి చూడాల్సిందే.

Exit mobile version