Site icon Prime9

శ్రీనివాస రామానుజన్ గణిత మేధావి ఎలా అయ్యారు?

srinivasa Ramanujan

srinivasa Ramanujan

Srinivasa Ramanujan: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన భారతీయుడు శ్రీనివాస రామానుజన్. తమిళనాడులో నివాసం ఉంటున్న కోమలమ్మాళ్, శ్రీనివాస అయ్యంగార్ దంపతులకు 1887 డిసెంబరు 22 న రామానుజన్ జన్మించారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను కనబరిచి ఆయిలర్ నియమాలు, త్రికోణమితికి చెందిన సమస్యలను సాధించారు.

విద్యాభ్యాసం..

రామానుజన్ 1892 అక్టోబరు 1న అదే ఊళ్ళో ఉన్న చిన్న పాఠశాలలో విద్యాభ్యాసాన్ని ప్రారంభించాడు. మార్చి 1894లో ఇతడిని ఒక తెలుగు మాధ్యమ పాఠశాలకు మార్చడం జరిగింది. రామానుజన్ తాత కాంచీపురం న్యాయస్థానం లోని ఉద్యోగం కోల్పోవడంతో, రామానుజన్ తల్లితో సహా కుంబకోణం చేరుకుని అక్కడ కంగయాన్ ప్రాథమిక పాఠశాలలో చేరాడు. నాన్న తరుపు తాత చనిపోవడంతో రామానుజన్ను మళ్ళీ మద్రాసులో నివాసం ఉంటున్న తల్లి తరుపు తాత దగ్గరికి పంపించారు. కానీ అతనికి మద్రాసులో పాఠశాల నచ్చలేదు. తరచూ బడికి ఎగనామం పెట్టేవాడు. అతని తాత, అమ్మమ్మలు రామనుజన్ బడిలో ఉండేటట్లుగా చూసేందుకు వీలుగా ఒక మనిషిని కూడా నియమించారు. కానీ ఆరు నెలలు కూడా తిరగక మునుపే కుంభకోణం పంపించేశారు. రామానుజన్ తండ్రి రోజంతా పనిలో లీనమవడం మూలంగా చిన్నపుడు అతని బాధ్యతలు తల్లే చూసుకొనేది. కాబట్టి తల్లితో చాలా గాఢమైన అనురాగం కలిగి ఉండేవాడు. ఆమె నుంచి రామానుజన్ సంప్రదాయాల గురించి, కుల వ్యవస్థ గురించి, పురాణాల గురించి తెలుసుకున్నాడు.

పెళ్లి…

1909, జులై 14వ తేదీన రామానుజన్ కు జానకీ అమ్మాళ్ అనే తొమ్మిదేళ్ళ బాలికతో వివాహమైంది. జీఎస్ కార్ రచించిన సినాప్సిస్ ఆఫ్ ప్యూర్ మ్యాథ్‌మెటిక్స్ అనే పుస్తకం శ్రీనివాస రామానుజన్‌లోని ప్రతిభను బయటకు తీసుకొచ్చింది.

గణితంపై మక్కువ…

ఆల్జీబ్రా, అనలిటికల్ జామెట్రీ లాంటి విషయాలకు సంబంధించిన 6165 సిద్ధాంతాలను నిరూపించడానికి పెద్ద పెద్ద ప్రొఫెసర్లు సైతం నానా తంటాలు పడేవారు. అయితే వారు అవగాహన చేసుకోలేకపోయిన సూత్రాలకు రామానుజన్ ఎలాంటి పుస్తకాల సహాయం లేకుండా అలవోకగా పరిష్కరించారు. కుంభకోణంలోని ప్రభుత్వ కాలేజీలో చేరిన రామానుజన్ తన దృష్టి కేవలం గణితంపై కేంద్రీకరించడంతో ఎఫ్.ఎ. పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత మద్రాసు లోని వచ్చయ్యప్ప కళాశాలలో చేరిన ఆయన, అక్కడ అధ్యాపకుడు ఎన్.రామానుజాచారి గణిత సమస్యలను కఠినంగా చెప్తుంటే, వాటిని సులభమైన రీతిలో తక్కువ సోపానాలతో సాధించేవాడు. రామానుజన్ ప్రతిభను గుర్తించిన ప్రొఫెసర్ సింగారవేలు మొదలియార్ ఆయనతో కలిసి మ్యాథమెటికల్ జర్నల్స్‌లో క్లిష్టమైన సమస్యలపై చర్చించి వాటిని సాధించేవారు. మ్యాజిక్ స్క్వేర్స్, కంటిన్యూడ్ ఫ్రాక్షన్స్, ప్రధాన సంఖ్యలు, పార్టిషన్ ఆఫ్ నంబర్స్, ఎలిప్టిక్ ఇంటిగ్రల్స్ లాంటి విషయాలపై పరిశోధనలు కొనసాగించారు. 1913లో మద్రాసు వచ్చిన ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త డాక్టర్ వాకర్ ఈ పరిశోధనలు చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. రామానుజన్ కనుగొన్న 120 పరిశోధన సిద్ధాంతాలను ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రొఫెసర్ గాడ్ ఫ్రెహెరాల్డ్ హార్టీకి పంపాడు.

లండన్ పయనం…

మహా మేధావులకు మాత్రమే సాధ్యమయ్యే పరిశోధన ఫలితాలను చూసిన హార్టీ, రామానుజన్‌ను కేంబ్రిడ్జి యూనివర్శిటీకి ఆహ్వానించారు. 1914 మార్చిలో లండన్‌ వెళ్లిన రామానుజన్ అక్కడ నిరంతరం గణితంపై పరిశోధనలు చేసి కొత్త సిద్ధాంతాలను కనిపెట్టారు. ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజి గౌరవం పొందిన తొలి భారతీయుడిగానూ, ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండో భారతీయుడిగానూ ఆయన చరిత్రకెక్కారు. ఐదేళ్ల అనంతరం బ్రిటన్ నుంచి 1919 మార్చిలో స్వదేశానికి తిరిగి వచ్చారు. భారతదేశ గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిన చెప్పిన రామానుజన్ అనారోగ్యంతో 1920 ఏప్రిల్ 26న మరణించారు. ఆయన పరిశోధనలను ఆధారంగా చేసుకుని కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్‌పై పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని 1986-87 రామానుజన్ శతజయంత్యుత్సవాల్లో గణిత శాస్త్రవేత్తలు ప్రకటించారు. గణితశాస్త్రంలో రామానుజన్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది.

Exit mobile version