Jana Sena chief Pawan Kalyan: జగన్‌కు చెబుతున్నా.. నన్ను అరెస్ట్ చేసుకోండి అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. గురువారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ మీరు ప్రాసిక్యూషన్ అంటే ప్రాసిక్యూషన్‌కు రెడీ.. జైలుకు వెళ్లేందుకు.. దెబ్బలు తినేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేసారు. మీరు నన్ను అరెస్టు చేసుకోండి.. చిత్రవధ చేసుకోండి. మీరు చేసే పనులను కోర్టులు కూడా చూస్తున్నాయి. మీరు మర్డర్లు చేసిన వారికి మద్దతుగా ఉన్నారు. మీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయంటూ పవన్ విరుచుకు పడ్డారు. వాలంటీర్ల వ్యవస్ద గురించి తాను స్పష్టంగా చెప్పానని అన్నారు. వాలంటీర్లకు ఉపాధి హామీ పధకం కూలీల కంటే తక్కువగా రోజుకు రూ.164 చొప్పున చెల్లిస్తున్నారని అన్నారు.
వ్యక్తిగత సమాచారం భద్రపరుచుకోవడం చాలా కీలకమని పవన్ కళ్యాణ్ అన్నారు. 23 అంశాల సమాచారం సేకరించి ఎక్కడికి పంపుతున్నారు ? సమాచార సేకరణపై ప్రభుత్వ విధివిధానాలు ఏమిటి? అంటూ పవన్ ప్రశ్నించారు. వాలంటీర్లతో చేయకూడని పని చేయిస్తున్నారు. సమాచారం సర్వర్‌లో పెట్టుకున్నా నేరం కిందకు వస్తుంది. వాలంటీర్లు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు.
సమాచార సేకరణపై అమిత్ షాతో మాట్లాడానంటూ ఆయన చెప్పారు. వాలంటీర్లు సేకరించిన సమాచారం అంతా మూడు కంపెనీలకు వెడుతోందని అన్నారు. 3 కంపెనీలు ఎవరివి? అధిపతులు ఎవరు? ప్రభుత్వం వద్ద ఉండాల్సిన సమాచారం ప్రైవేటుపరం చేశారు. డేటా అంతా నానక్‌రామ్‌గూడలోని FOA కంపెనీకి వెడుతోంది. మీ బ్యాంకు డీటైల్స్ అనుకోని వారి చేతిలో పడితే ఏంటి పరిస్థితి? బాలికపై వాలంటీర్ అత్యాచారం చేస్తే బాధ్యత ఎవరిది? సీఎం బాధ్యత వహించాలా? మంత్రులా? ఎమ్మెల్యేలా? అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
అలయన్స్ మీటింగ్ కోసం తాను ఢిల్లీ వెళ్లానని పవన్ చెప్పారు. ప్రధాని, బీజేపీ నాయకత్వంతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేశారు
అలాంటి నిరాధార వార్తలకు నేను ప్రాధాన్యం ఇవ్వను. ప్రధాని, నాకు మధ్య ఉన్న అవగాహన చాలా బలమైనది. అది ప్రజలకు సంబంధించినది, ఏపీ ఆర్థిక పరిపుష్టికి సంబంధించినది.
ఏపీకి పటిష్టమైన భవిష్యత్ ఇవ్వమని హోంమంత్రిని కోరాను. జగన్ పోవడం, ఎన్డీఏ రావడం ఒక్కటే పరిష్కారం. జనం బాగుండాలంటే జగన్ పోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీలో చేరిన విశాఖ జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబుకు పవన్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానింగారు. రమేష్ బాబుకు సముచిత స్దానం కల్పిస్తామని చెప్పారు.
మహిళల అక్రమ రవాణా, వాలంటీర్ల ఆగడాలని ఎత్తి చూపిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని ఏపీ ప్రభుత్వం కేసుల పేరుతో నిలువరించాలని చూస్తోంది. ఈ నెల 9న ఏలూరులో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కిందికి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేసారు.