Rajini kanth : సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను సంపాదించుకున్నారు రజినీ. ఆయన స్టయిల్, డైలాగ్ డెలివరీ సినిమాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పాలి. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరిగా నిలిచి విదేశాల్లో కూడా మంచి మార్కెట్ ఉన్న స్టార్ అంటే రజినీ అనే చెప్పాలి. అయితే రజినీ కాంత్ గతంలో రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించి ఆ తర్వాత ఆ నిర్ణయం నుంచి వెనక్కి తగ్గారు. ఆయన నిర్ణయం పట్ల అభిమానులు ఒకింత నిరాశ చెందిన మాట వాస్తవమే. ఆ నిర్ణయం నుంచి తాను యూటర్న్ ఎందుకు తీసుకున్నానన్న విషయాన్ని రజనీకాంత్ తాజాగా వెల్లడించారు.
చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో గతరాత్రి జరిగిన సేఫియన్స్ హెల్త్ ఫౌండేషన్ రజతోత్సవాలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడితో కలిసి రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను మూత్రపిండాల సమస్యతో బాధపడుతుండడం వల్లే రాజకీయాలకు దూరమైనట్టు చెప్పారు. తాను ఆ సమస్యకు చికిత్స పొందుతున్న సమయంలో రాజకీయాల్లోకి రావాలని అనుకున్నానని చెప్పారు. అయితే, రాజకీయాల్లోకి వస్తే ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుందన్నారు. ఎక్కువ కార్యక్రమాలతో బిజీగా ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదని అప్పట్లో డాక్టర్ రాజన్ రవిచంద్రన్ తనకు సలహా ఇచ్చారని రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.
అలానే తాను కరోనా సమయంలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా చాలామంది ఇలాంటి సలహానే ఇచ్చినట్టు చెప్పారు. అప్పట్లో తాను బహిరంగ సభల్లో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని, అందుకనే రాజకీయాల నుంచి తప్పుకున్నట్టు తెలిపారు. తాను ఈ విషయాలు చెబితే తాను భయపడుతున్నానని అనుకుంటారని, అందుకనే ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టలేదని రజనీకాంత్ చెప్పుకొచ్చారు. దేవుడు ఉన్నాడని చెప్పిన రజనీకాంత్.. లేడు అనే వారు కనీసం ఒక్క రక్తపు బొట్టునైనా తయారు చేసి చూపించాలని సవాలు చేశారు. అదే విధంగా ఈ ఈవెంట్‌లో వెంకయ్య నాయుడుని గురించి చెబుతూ.. ‘గొప్ప నాయకుడైన వెంకయ్య నాయుడు గారిని రాజకీయాల నుంచి దూరం చేశారు. ఆయనకు ఉపరాష్ట్రపతి ఇవ్వటం నాకు నచ్చలేదు’ అన్నారు.
ఇక వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావొద్దని తాను కూడా రజనీకాంత్‌కు హితవు పలికానన్నారు. అయితే, ఆ సమయంలో తనను అపార్థం చేసుకున్నారన్నారు. యువత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని సూచించారు. ప్రస్తుతం రజిని చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/