Site icon Prime9

BJP-TRS: బీజేపీకీ ఈడీ.. కేసీఆర్ అండ్ కోకు పోలీసులా ?

BJP-TRS: మోదీ, ఈడీ, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ నోట తరచూ వినిపించే మాట. బలమైన నేతలు, ఎదురుతిరుగుతున్న నేతలను తమదారిలోకి తెచ్చుకునేందుకు ఈడీ, సీబీఐని కేంద్రంలోని బీజేపీ సర్కారు విచ్ఛలవిడిగా వాడుతోందన్న ఆరోపణలున్నాయి. అందులో వాస్తవం కూడా లేకపోలేదు. అయితే, మోదీ, అమిత్‌షాలకు ఈడీ అయితే, కేసీఆర్ అండ్ కో కు పోలీసులా? జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అలానే అనిపిస్తోంది. అధికారంలో ఎవరున్నా సరే రాజ్యాంగబద్ధ సంస్థలను తమ లబ్ది కోసం వాడుకుంటున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

కేంద్రంలోని మోదీ సర్కారు తన రాజకీయ ప్రత్యర్థుల లెక్క తేల్చేందుకు వారిని దారికి తెచ్చుకునేందుకు ఈడీని విరివిగా వాడేస్తుందన్న మాట బలంగా వినిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయాలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉండటంతో అధికార పార్టీపై ఒత్తిడి పెంచేందుకు, వారిలో ఆందోళనను పెంచేందుకు వీలుగా బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గతంలో కేసీఆర్ ఏ తరహాలో రాజకీయాన్ని నడిపారో ఇప్పుడు అదే రాజకీయాన్ని ఆయనకు రుచి చూపిస్తోంది. టీఆర్ఎస్‌ను బలపర్చుకునే క్రమంలో ఇతర పార్టీల్లోని అసంత్రప్తుల్ని అక్కున చేర్చుకోవటం తెలిసిందే. బీజేపీ సైతం ఇప్పుడు టీఆర్ఎస్ విషయంలో అదే అమలు చేస్తోంది. అయితే, తమపై ఒత్తిడిని పెంచుతూ తమ నేతల్ని పార్టీ వీడిపోయేలా చేస్తున్న బీజేపీకి షాకిచ్చే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తోంది టీఆర్‌ఎస్‌. ఇందులో భాగంగా తమ పార్టీకి చెందిన నేతలకు కొత్త భయాన్ని గుర్తు చేసేందుకు పాత కేసుల్ని బయటకు తీస్తుందన్న విమర్శలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. మునుగోడు ఉపబరిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దించాలని సీఎం కేసీఆర్ భావించటం. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసమ్మతిని వినిపిస్తున్న నేతలకు తొలుత సర్ది చెప్పటం అయినప్పటికీ వారు తమ తీరును మార్చుకోకపోవటతో వారికి నాయకత్వం వహిస్తున్న వారెవరు? అన్న విషయాన్ని గుర్తించి టార్గెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

అసమ్మతి నాయకత్వం వహిస్తున్న వారిలో చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకటరెడ్డిని దారికి తెచ్చుకోవటానికి వీలుగా ఆయన పై పాత కేసుల్ని తెర మీదకు తెచ్చారని, ఇందులో భాగంగా ఆయన్ను సోమవారం రాత్రి అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేసినట్లుగా చెబుతున్నారు. దీంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయిన ఆయన బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నట్లు చెబుతున్నారు. ఇంతకాలం ఎంపీపీ మీద ఉన్న కేసుల విషయంలో పోలీసులు పట్టనట్లుగా వ్యవహరిస్తూ, తాజాగా మాత్రం అందుకు భిన్నంగా యాక్టివ్ కావటం గమనార్హం. అంతేకాదు, కొందరు రైతులు వెంకట్ రెడ్డి దౌర్జన్యంగా తమ భూముల్ని పట్టా చేయించుకున్నారంటూ ధర్నాకు దిగటం కూడా రాజకీయమే అన్న మాట వినిపిస్తోంది. తాడూరి వెంకటరెడ్డి పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేసేందుకు పోలీసులు సివిల్ డ్రెస్ లో వెళ్లగా, ఇంట్లో ఉన్నఆయన బయటకు రావటానికి అభ్యంతరం వ్యక్తం చేశారని చెబుతున్నారు. దీంతో స్థానికంగా ఉన్న బీజేపీ నేతలకు సమాచారం ఇవ్వటంతో వారంతా వెంకట్ రెడ్డి ఇంటికి వచ్చి ముందస్తు నోటీసులు లేకుండా రాత్రిపూట అరెస్టు చేయటం ఏమిటని ప్రశ్నించటంతో పోలీసులు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లిన వెంకట్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోవటం గమనార్హం. ఈ మొత్తం ఎపిసోడ్ ను ఉదాహరణగా చూసినప్పుడు, కేంద్రంలో మోదీ సర్కారు ఈడీ, సీబీఐలను ప్రయోగిస్తుందన్న విమర్శలు ఎంత బలంగా ఉన్నాయో, తెలంగాణలో కేసీఆర్ సర్కారు తన ప్రత్యర్థులపై పోలీసుల్ని ప్రయోగిస్తుందన్న వాదన అంతే బలంగా వినిపిస్తోంది.

Exit mobile version