Madhya Pradesh: పొంతన లేని ఆరోపణలతో మధ్యప్రదేశ్ భాజాపా నేతలు, కాంగ్రెస్ అగ్రనేత తలపెట్టిన భారత్ జోడో యాత్రను అడ్డుకొనేందుకు కుటిలయత్నం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ ఛైర్మన్ కేకే మిశ్రా బ్రాహ్మణ వర్గం పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసారంటూ వారు పేర్కొన్నారు. దీనిపై భాజాపా కార్యకర్తలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాధ్ నివాసం వద్ద నిరసనలకు దిగారు.
విషయం మేరకు, కేకే మిశ్రా మీడియా సమావేశంలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, తాను బ్రాహ్మణుడిగా గర్విస్తున్నానని, అన్నిటికన్నా మానవత్వమే గొప్పతనంగా ఆయన పేర్కొన్నారు. తప్పు చేస్తే తన వర్గం వారైన సమర్ధించలేనని గంటాపదంగా చెప్పారు.
వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో పెద్ద యెత్తున ప్రచారం కావడంతో భాజాపా నేతలు నిప్పులు చెరిగారు. పెద్ద రాద్ధాంతం చేసేందుకు రాష్ట్ర భాజాపా నేతలు ప్లాన్ చేశారు. బీజేపీ భోపాల్ జిల్లా అధ్యక్షుడు సుమిత్ పచౌరి ఆధ్వర్యంలో కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. మిశ్రా మాటలు అర్ధరహితం అంటూ, ఆయన్ను పార్టీ నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు ప్రతిగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సాగుతున్న భారత్ జోడో యాత్రను మధ్యప్రదేశ్ లోకి అడుగుపెట్టకుండా అడ్డుకొంటామని కాంగ్రెస్ పార్టీకి భాజాపా కార్యకర్తలు హెచ్చరించారు.
దీనిపై కమలనాధ్ స్పందిస్తూ అసలేమి జరిగిందో తెలుసుకొని తగిన చర్యలు తీసుకొంటానని నిరసనకారులకు హామీ ఇచ్చారు. మిశ్రా మాత్రం ఈ విషయాన్ని కొట్టి పారేశారు. కేవలం రాహుల్ గాంధీకి వస్తున్న స్పందన చూసి ఓర్వలేక తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.