YS Vijayamma : పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా ? వైఎస్ విజయమ్మ

పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా. ? అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ ప్రశ్నించారు.

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 07:38 PM IST

YS Vijayamma: పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా. ? అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ ప్రశ్నించారు. ఎస్ఆర్ నగర్ పీఎస్‌లో వున్న తన కుమార్తె, వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను కలిసేందుకు విజయమ్మ బయల్దేరారు. అయితే అక్కడి ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో లోటస్ పాండ్‌లోని నివాసంలోనే విజయమ్మను అడ్డుకున్నారు పోలీసులు. దీనితో తనను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ విజయమ్మ దీక్షకు దిగారు.

షర్మిల దేనికీ భయపడే రకం కాదని ఆమె తేల్చిచెప్పారు. తన కూతురికి తోడుగా వుండేందుకు వెళ్తానన్నానని, పోలీసులు ఒప్పుకోవడం లేదని విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు చెప్పిన సమస్యలపైనే షర్మిల మాట్లాడుతోందన్నారు. కేసీఆర్‌పై షర్మిల ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని విజయమ్మ తేల్చిచెప్పారు. షర్మిల చేసిన నేరం ఏంటన్న ఆమె.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా అని ప్రశ్నించారు. మేం ప్రభుత్వాల్ని నడపలేదా.. తమకు పోలీసులు కొత్త కాదని విజయమ్మ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. షర్మిల అరెస్ట్ గురించి తెలుసుకున్న వైఎస్సార్‌టీపీ కార్యకర్తలు, అభిమానులు ఎస్ఆర్ నగర్ పీఎస్‌కు భారీగా చేరుకుంటున్నారు.

నర్సంపేటలో టీఆర్ఎస్ శ్రేణుల దాడికి నిరసనగా మంగళవారం ప్రగతి భవన్ ను ముట్టడించాలని వైఎస్ఆర్‌టీపీ తలపెట్టింది. షర్మిల లోటస్ పాండ్ నుండి ధ్వంసమైన కారుతో ప్రగతి భవన్ వైపునకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు పంజాగుట్టలో షర్మిలను అడ్డుకున్నారు. అయితే కారులో నుండి దిగకుండా ఆమె నిరసనకు దిగారు. ప్రగతి భవన్ కు తాను వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. కారు అద్దాలు కూడా దించలేదు. దీంతో పోలీసులు క్రేన్ సహాయంతో కారుతో సహా షర్మిలను ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.