Bengaluru: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం కోసం వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ను పక్షి ఢీకొట్టింది. దీంతో హెలికాఫ్టర్ ను హెచ్ఏఎల్ విమానాశ్రయంలో ఎమెర్జెన్సీ ల్యాండ్ చేశారు.
ఈ ఘటనలో హెలికాప్టర్ అద్దం పగిలింది. కాగా, శివకుమార్ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు బెంగళూరులోని జక్కూర్ ఎయిర్‌పోర్టు నుంచి కోలార్ జిల్లాలోని ముల్‌బాగల్ కు బయలుదేరారు. హెలికాఫ్టర్ టేకాఫఖ్ అయిన కొద్ది క్షణాలకే ఈ ఘటన జరిగింది. అయితే ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో కాంగ్రెస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదంపై డీకే ట్వీట్ (Bengaluru)
ఈ హెలికాఫ్టర్ ప్రమాదంపై డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. కన్నడ ప్రజల ఆశీర్వాదం వల్ల తాను ప్రమాదం నుంచి బయటపడ్డానని పేర్కొన్నారు. తనతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికుడికి, పైలట్ కు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పైలట్ వెంటనే అప్రమత్తమై సురక్షితంగా ల్యాండ్ చేశారన్నారు. ప్రస్తుతం రోడ్డు మార్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నట్టు డీకే శివకుమార్ తెలిపారు.
సర్వ జనాంగద శాంతియ తోట పేరుతో మేనిఫెస్టో(Bengaluru)
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని రాజకీయ పార్టీలు కన్నడ ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాతి రోజే కాంగ్రెస్ పార్టీ కూడా ఓటర్లకు వరాలు ప్రకటించింది. గృహిణులు, నిరుద్యోగ యువత, ఉద్వేగ ప్రసంగాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ తన మేనిఫెస్టోను ఓటర్ల ముందుకు తీసుకొచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఆ పార్టీ కర్ణాటక ఛీప్ డీకే శివకుమార్ లు కలిసి ఈ మేనిఫెస్టో విడుదల చేశారు. ‘సర్వ జనాంగద శాంతియ తోట’ పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు.
మే 10న ఎన్నికలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరుగనున్నాయి. 13 న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 స్థానాలుండగా.. మెజార్టీకి 123 సీట్లు అవసరం. ఈ సారి కచ్చితంగా 150 స్థానాలకుపై కైవసం చేసుకుంటామని కాంగ్రెస్ చెబుతోంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కర్ణాటకలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.