Manipur Chief Minister Biren Singh: మణిపూర్ లో కొనసాగుతున్న హింసాకాండ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ రాజీనామా లేఖను శుక్రవారం పలువురు మహిళలు చించివేశారు.బీరెన్ సింగ్ రాజీనామా పత్రంలో పాటు 20 మంది ఎంఎల్‌ఏలను తీసుకుని గవర్నర్ నివాసానికి బయలు దేరారు. అయితే సీఎం తన అధికార నివాసం నుంచి బయటకు రాగనే ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయనను అడ్డుకున్నారు. రాజీనామా చేయడానికి వీల్లేదని ముక్తకంఠంతో నినదించారు. దీంతో విధిలేని పరిస్థితిలో బీరేన్ సింగ్ తిరిగి తన నివాసంలోకి రావాల్సి వచ్చింది.
అటు తర్వాత పీడబ్ల్యుడి మంత్రితో పాటు మరి కొందరు మంత్రులు మద్దతు దారులను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా మంత్రి సుసిద్రో మెటిటీ గవర్నర్‌కు సమర్పించే రాజీనామా పత్రాన్ని చదివి వినిపించారు. అటు తర్వాత రాజానామా పత్రాన్ని అక్కడ గుమిగూడిన జనాలకు అందించారు. ఇంతలోనే కొంత మంది మహిళలు ముందుకు వచ్చి రాజీనామా పత్రాన్ని చించేశారు. కాగా బీరేన్‌సింగ్ మద్దతు దారులు మాత్రం ఆయన రాజీనామా చేయడానికి ససేమిరా అంటున్నారు. మణిపూరలో హింసను ఉక్కుపాదంతో అణిచి వేయాలని వారు డిమాండ్ చేశారు.మణిపూర్‌లో గురువారం జరిగిన హింసాత్మక ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారు. దీనితో ఎన్ బీరేన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
మరోవైపు కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ మణిపూర్ గవర్నర్‌ను ఈ రోజు కలిశారు. అటు తర్వాత ఆయన మీడియాలో మాట్లాడుతూ.. మణిపూర్‌లో శాంతి నెలకొల్పాలని పిలుపునిచ్చారు. రిలీప్ క్యాంప్‌లో తాను పర్యటించానని అక్కడ వసతులు సరిగా లేవన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. ఈ రోజు సాయంత్రం పౌర సమాజానికి చెందిన ప్రముఖులతో సమావేశం అవుతానని రాహుల్ అన్నారు.