Woman IRS officer Sex Change: హైదరాబాద్‌లోని కస్టమ్స్, ఎక్సైజ్ మరియు సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (CESTAT) ప్రాంతీయ బెంచ్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న మహిళా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి పురుషుడిగా మారారు. ఇండియన్ సివిల్ సర్వీసెస్‌లో లింగమార్పిడి జరిగిన మొదటి కేసు ఇదే. తన పేరును ఎం అనుకతిర్ సూర్యగా మార్చాలని అనుసూయ చేసిన అభ్యర్థనను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింది.
రికార్డుల్లో పేరు మార్పు.. (Woman IRS officer Sex Change)
అనుసూయ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నాము. ఇకపై అన్ని అధికారిక రికార్డులలో అనుకతిర్ సూర్య’గా గుర్తించబడతారని భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వును జారీ చేసింది. అనుకతిర్ 2013లో అసిస్టెంట్ కమిషనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. సూర్య డిసెంబర్ 2013లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా తన వృత్తిని ప్రారంభించి, 2018లో డిప్యూటీ కమిషనర్‌గా పదోన్నతి పొందారు.చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. 2023లో భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుండి సైబర్ లా మరియు సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా చేశారు.సుప్రీంకోర్టు, ఏప్రిల్ 15, 2014న NALSA కేసులో తన తీర్పులో, థర్డ్ జెండర్‌ను గుర్తించి, ఒక వ్యక్తి సెక్స్ రీఅసైన్‌మెంట్ సర్జరీ చేయించుకున్నా లేదా చేయకున్నా లింగ గుర్తింపు అనేది వ్యక్తిగత ఎంపిక అని తీర్పునిచ్చింది..