Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 4వ తేదీ నుంచి 22 వరకు మొత్తం 19 రోజులు 15 సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X ద్వారా వెల్లడించారు. డిసెంబర్ 3న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ మరుసటి రోజే పార్లమెంట్ వింటర్ సెషన్ మొదలవుతుంది.
క్రిస్మస్ పండుగకు మూడు రోజుల ముందు డిసెంబర్ 22న సమావేశాలు ముగియనున్నాయి. ఈ సమావేశాల్లో ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల సవరణలకు సంబంధించిన బిల్లులు చర్చకు రానున్నాయి. ఈ బిల్లులకు సంబంధించిన మూడు నివేదికలు ఇప్పటికే కేంద్ర హోంశాఖ స్టాండింగ్ కమిటీకి చేరాయి. అదేవిధంగా పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్‌ల నియామకానికి సంబంధించిన బిల్లులపై కూడా ఈ సమావేశాల్లో చర్చ జరుగనుంది.
వాస్తవానికి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రతి ఏడాది నవంబర్ మూడో వారంలో ప్రారంభమై క్రిస్మస్ పండుగకు ముందు ముగుస్తాయి. కానీ, ఈసారి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆలస్యంగా పార్లమెంట్ వింటర్ సెషన్ మొదలవుతున్నది. ఎప్పటిలాగే క్రిస్మస్ పండుగకు ముందు సెషన్ ముగియనుంది.