Site icon Prime9

NEET-UG Row 2024: నీట్‌ పరీక్షల రద్దు ప్రసక్తే లేదు.. ధర్మేంద్రప్రధాన్‌

DHARMENDRA PRADHAN

DHARMENDRA PRADHAN

NEET-UG Row 2024: మెడికల్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌… నీట్‌ పరీక్షలను రద్దు చేసే ప్రసక్తి లేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం నీట్‌ పరీక్షలపై ఒక వైపు పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతోంది. అయితే పరీక్షలు ఎందుకు రద్దు చేయడం లేదో విద్యాశాఖమంత్రి ధర్మేంద్రప్రధాన్‌ వివరించారు.

కోర్టు నిర్ణయమే ఫైనల్..(NEET-UG Row 2024)

నీట్‌ పరీక్షా పేపర్‌ లీక్‌ వల్ల కేవలం కొంత మంది విద్యార్థులపై ప్రభావం చూపించింది. గతంలో 2004 అటు తర్వాత 2015లో కూడా పెద్ద ఎత్తున ప్రశ్నా పత్రాలు లీక్‌ కావడం తర్వాత పరీక్షలు రద్దు కావడం చూశాం. ఒక వేళ పరీక్షలు రద్దు చేస్తే లక్షలాది మంది వద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో ఉంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని ప్రధాన్‌ అన్నారు.ఇక అసలు వివాదం విషయానికి వస్తే 67 మంది విద్యార్థులు నీట్‌ యూజీ పరీక్షలో పక్కాగా 720 మార్కులు సాధించారు. అటు తర్వాత నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కొంత మంది విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు వేసినట్లు తెలిపింది. దీనికి ప్రధాన కారణం ప్రశ్నా పత్రంలో తప్పులు దొర్లడం.. విద్యార్థులకు ప్రశ్నా పత్రం ఆలస్యంగా అందడం అని మంత్రి వివరించారు.

ఈ ఏడాది మే 5న జరిగిన నీట్‌-యుజి 2024 పరీక్షను సుమారు 24 లక్షల మంది విద్యార్థులు రాశారు. వాస్తవానికి పరీక్షా ఫలితాలు జూన్‌ 14న విడుదల కావాల్సింది దాన్ని ఈ నెల 4న ఫలితాలు ప్రకటించారు. అటు తర్వాత కొశ్చన్‌ పేపర్‌ లీక్‌ అయ్యిందన్న వివాదంతో పాటు 1,500 మంది విద్యార్థులకు గ్రేస్‌ మార్కులు కలిపారని పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. కేసు సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు కూడా ఈ కేసుపై సీరియస్‌ అయ్యింది. 0.001 శాతం నిర్లక్ష్యం కనిపించినా కఠిన చర్యలు తీసుకుంటమని ఎన్‌టీఏని హెచ్చరించింది. కాగా కేంద్రం మాత్రం పరీక్షలను రద్దు చేయడానికి నిరాకరిస్తోంది. కేవలం బిహార్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మాత్రమే లబ్ధి పొందారని తెలిపింది. వారితో పాటు మరో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని తెలిపింది.

పేపర్‌ లీక్‌ అనేది ఎన్‌టీఏ సంస్థాగత వైఫల్యం అని ప్రధాన్‌ చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి కమిటిని వేశామని, ఎన్‌టీఏ ఎలా పనిచేస్తుందో చూస్తుందన్నారు. అయితే ప్రస్తుతానికి పరీక్షలు రద్దు చేసే ప్రసక్తి లేదని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ప్రతిపక్ష పార్టీలు దీన్ని తమ రాజకీయ ప్రయోజనానికి వాడుకోరాదని కోరారు. దోషులు ఎంత పెద్ద వారైనా వారిని వదిలే ప్రసక్తి లేదని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు.

 

Exit mobile version