Karnataka CM: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమైనట్లే. ఈ నేపధ్యంలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై సర్వత్రా చర్చ మొదలయింది. మాజీ సీఎంసిద్ధరామయ్య మరియు పీసీసీ చీఫ్ డికె శివకుమార్‌ల మధ్య సీఎం సీటుకోసం పోటీ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. సిద్ధరామయ్య ఇప్పటికే 2023 ఎన్నికలను తన చివరి ఎన్నికలని ప్రకటించినందున, అతను మరోసారి ముఖ్యమంత్రిగా విధానసౌద మెట్లు ఎక్కాలనే ఆశయంతో ఉన్నారనేది రహస్యం కాదు. మరోవైపు శివకుమార్ కూడా తాను కష్టపడి పనిచేశానని తన కష్టానికి పార్టీ తగిన ప్రతిఫలం ఇస్తుందనే ఆశతో ఉన్నారు.
మా నాన్న సీఎం కావాలి..(Karnataka CM)
కురుబ కమ్యూనిటీకి చెందిన సిద్ధరామయ్య AHINDA (అల్పసంఖ్యతరు లేదా మైనారిటీలు, హిందూలిదవారు లేదా వెనుకబడిన తరగతులు, మరియు దళితారు లేదా దళితులకు కన్నడ సంక్షిప్త పదం) యొక్క తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. తాను సీఎం పదవిని ఆశిస్తున్నానని, అదే సమయంలో డీకే శివకుమార్ కూడా పోటీలో ఉన్నారని అన్నారు. అయితే హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని ఆయన స్పష్టం చేసారు. మరోవైపు సిద్దరామయ్య కొడుకు యతీంద్ర తన కర్ణాటక ప్రయోజనాలకోసం తన తండ్రిని సీఎం చేయాలని అన్నారు.
గాంధీ కుటుంబానికి ఇష్టుడు..
2017లో సోనియాగాంధీ సలహాదారు అహ్మద్ పటేల్ రాజ్యసభ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల క్యాంప్ ను విజయవంతంగా నిర్వహించినందుకు గాను డీకే శివకుమార్ గాంధీ కుటుంబం వద్ద మంచి మార్కులు సంపాదించారు. తరువాత ట్రబుల్ షూటర్ పేరు కూడా సంపాదించారు. ఆయన మనీలాండరింగ్ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్నపుడు సోనియాగాంధీ స్వయంగా వెళ్లి పరామర్శించారు. పార్టీకి అవసరమైన ఆర్దిక వనరులను సమకూర్చడం, ఎమ్మెల్యేలను కాపాడుకోవడంలో డీకే మంచి సమర్దుడు. గాంధీ కుటుంబానికి ఆయనపై ఉన్న మంచి అభిప్రాయంవలన ఆయనే సీఎం కావచ్చని మెజార్టీ పార్టీ శ్రేణులు కూడా భావిస్తున్నాయి. అయితే సిద్దరామయ్య తరహాలోనే డీకే కూడా సీఎం పదవి కాంగ్రెస్ హైకమాండ్ ఇష్టమని చెప్పేసారు.సీఎం రేసులో ఉన్న మరో సీనియర్ నేత జి. పరమేశ్వర. ఆయన ఎనిమిదేళ్లు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. హెచ్‌డి కుమారస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-జెడి(ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. తాను కూడా సీఎం రేసులో ఉన్నానని పరమేశ్వర స్పష్టం చేసారు.
గతంలోనే మిస్సయింది..
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సీఎం అభ్యర్ది రేసులో ఉన్నారు. వాస్తవానికి ఈ సీనియర్ నేతకు సీఎం పదవి గతంలో కూడా తప్పిపోయింది. 2008లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోవడం మరియు 2013లో సిద్ధరామయ్యను ఓబీసీ ముఖంగా ఆ స్థానానికి ఎంపిక చేయడంతో తప్పుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో దళితుడిని సీఎంగా నియమించవచ్చని పార్టీలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఖర్గే పేరు ప్రచారంలోకి వచ్చింది.