Site icon Prime9

Rajasthan Elections: రాజస్థాన్ లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి?

Rajasthan Elections

Rajasthan Elections

Rajasthan Elections: రాజస్థాన్‌లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కదాన్నీ కాంగ్రెస్‌ పార్టీ పరిపూర్ణంగా అమలుచేయలేదు. 2018 ఎన్నికల వేళ జన్‌ ఘోష్నా పత్ర పేరిట రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో తీసుకొచ్చింది. 2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, యువతులకు ఉచిత విద్య, 3,500 నిరుద్యోగ భృతి, రూపాయికే కిలో గోధుమలు, పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు, ప్రతి పంచాయతీకి ఇంటర్నెట్‌ సదుపాయం తదితర హామీలిచ్చిన ఆ పార్టీ వాటి అమలులో చేతులెత్తేసింది. డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌తో వర్గ పోరు కారణంగా ఆ రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లాట్‌ తన పదవిని కాపాడుకోవడానికే సమయం సరిపోయింది . కాంగ్రెస్‌ ధ్యాసంతా సీఎం కుర్చీమీదనే ఉన్నదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు .దీనితో కాంగ్రెస్ పార్టీ చతికల పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

హామీలను పక్కన పెట్టి..(Rajasthan Elections)

వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ సర్కారు.. దాన్ని అమలు చేయడం అటుంచి అధికారంలోకి వచ్చీ రాగానే విద్యుత్తు చార్జీలను అమాంతం పెంచేసింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు హఠాత్తుగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అంశం గుర్తుకు వచ్చింది. బడ్జెట్‌ సమావేశాల్లో ముఖ్యమంత్రి గెహ్లాట్‌ ‘చీఫ్‌ మినిస్టర్‌ ఎలక్ట్రిసిటీ ఫర్‌ ఫార్మర్‌’ పేరుతో పథకం ప్రకటించారు. 2 వేల యూనిట్ల వరకే ఈ స్కీమ్‌ వర్తిస్తుందని మెలిక పెట్టారు. దీంతో 58 లక్షల మంది రైతుల్లో చిన్న కమతాలున్న 11 లక్షల మందికి మాత్రమే ఈ స్కీమ్‌ ద్వారా లబ్ధి చేకూరనున్నది. స్కీమ్‌ ప్రారంభం కాగానే, గృహ వినియోగ విద్యుత్తు యూనిట్‌పై 30 పైసలు చార్జీని ప్రభుత్వం పెంచింది. ఆ తర్వాత మరో 45 పైసల వాత విధించింది.దీనితో వ్యతిరేకత పెరిగింది.వృద్ధుల పింఛన్‌ పెంపును పక్కనబెట్టిన సర్కారు ఇటీవలే ఆ మొత్తాన్ని రూ. వెయ్యికి పెంచింది. ఇదే సమయంలో కనీస వయసు 75 ఏళ్ళు నిండి ఉండాలని మెలిక పెట్టింది. నిరుద్యోగులకు రూ. 3,500 భృతి ఇస్తామన్న సర్కారు దాన్ని రూ. 3 వేలకు తగ్గించింది . దింతో ఆయా వర్గాలు అసంతృప్తితో రగిలి పోయారు .తమ అసంతృప్తిని ఓట్ల రూపంలో చూపించారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

రైతుల వ్యతిరేకత..

.2018 ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో మొత్తం 23.5 లక్షల రైతులకు సంబంధించి రుణమాఫీ చేయాల్సి ఉంది. అయితే, 59 వేల మంది రైతులకు సంబంధించిన రూ.409 కోట్ల రుణాలు మాత్రమే మాఫీ చేశారు. ఇదే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి నాంది పలికింది. గత ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లో రైతు రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అయితే, సహకార బ్యాంకుల్లో రూ. 2 లక్షల వరకు తీసుకున్న పంట రుణాలను మాత్రమే ప్రభుత్వం రద్దు చేసింది. జాతీయ, వాణిజ్య బ్యాంకుల్లో రైతులు తీసుకొన్న రుణాలకు తమకు సంబంధం లేదని ఏవేవో కారణాలను చూపింది. రుణమాఫీ చేయకపోవడంతో అనేక మంది రైతులు ఆత్మ హత్యలు చేసుకునాన్రు. దీని పై రైతుసంఘాలు, విపక్షాలు మండిపడ్డాయి. 90 శాతం రైతులకు రుణమాఫీ పథకం వర్తించలేదని వామపక్షాల ఆధ్వర్యంలో ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ ఆరోపించింది. రుణమాఫీకి ప్రభుత్వం విధించిన షరతులు దారుణంగా ఉన్నాయని విశ్లేషకులు సైతం చెప్పారు.దీనితో రైతులు కాంగ్రెస్ పార్టీ కి వ్యతిరేఖంగా ఓట్లు వేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version
Skip to toolbar