West Bengal: వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీపై మరో రాష్ట్రంలో కూడా నిషేధం వేటు పడింది. తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం శాంతిభద్రతలని కారణంగా చూపిస్తూ నిషేధం విధించింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లోని మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా కేరళ స్టోరీ సినిమాపై నిషేధం విధించింది.
శాంతి భద్రతలని కాపాడేందుకే ..(West Bengal)
సినిమా కారణంగా పరిస్థితులు హింసకి దారితీయకుండా శాంతి భద్రతలని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని మమతా బెనర్జీ ప్రకటించారు. బీజేపీ నిధులతో బెంగాల్‌పైన కూడా సినిమా తీయబోతున్నారని మమత ఆరోపించారు. అసలు కశ్మీర్ ఫైల్స్ ఏంటి.? కేరళ స్టోరీ ఏంటి.? ఈ రెండు సినిమాలు ఓ వర్గాన్ని కించపరిచేలా తీసినవేనని మమతా బెనర్జీ అన్నారు.రాష్ట్రంలో ధియేటర్లనుంచి నుండి ఈ సినిమాను తొలగించేలా చూడాలని మమత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. బెంగాల్‌లో శాంతిని నెలకొల్పేందుకు మరియు ద్వేషపూరిత నేరాలు మరియు హింసాత్మక సంఘటనలను నివారించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.
దీదీ కళ్ళు మూసుకోవాలనుకుంటున్నారు..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. మమతా బెనర్జీ వాస్తవానికి కళ్ళు మూసుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నారు.‘ది కేరళ స్టోరీ’ సినిమాను సీఎం మమతా బెనర్జీ నిషేధించారు. ఆశ్చర్యం ఏమీ లేదు, అది ఆమె నుండి ఊహించబడింది. ఇది నిజమైన కథల ఆధారంగా మరియు ఇస్లామిస్టులు హిందూ బాలికలను లవ్ జిహాద్‌లో ఎలా ట్రాప్ చేసి, తరువాత ఐసిస్ ఉగ్రవాదులుగా మారడానికి పంపుతారో చూపిస్తుంది. దీదీ వాస్తవికతకు కళ్ళు మూసుకోవాలనుకుంటున్నారని పేర్కొన్నారు.
ది కేరళ స్టోరీని పశ్చిమ బెంగాల్‌లో నిషేధించడంపై చిత్ర నిర్మాత విపుల్ షా స్పందిస్తూ ఆమె అలా చేసి ఉంటే, మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాము, చట్ట నిబంధనల ప్రకారం ఏది సాధ్యమైతే అలా మేము పోరాడుతామని అన్నారు.