Wakefit Solutions: నిద్ర కూడా ఓ వరమే.. పడుకోగానే నిద్ర పట్టేస్తే ఎంతో హాయిగా ఉంటుంది. కొంతమంది ఏ కాస్త సమయం దొరికినా ఓ కునుకేస్తారు. సరిపడా నిద్ర పోయినవారికి ఎలాంటి ఒత్తిడి
ఉండదు. ఎలాంటి అంతరాయాలు లేకుండా ప్రశాంతంగా నిద్రపోయే వాళ్లని అదృష్టవంతులంటారు.
ఆరోగ్యకరమైన లైఫ్ స్టయిల్ కి మంచి నిద్ర మైలురాయి. ఎందుకంటే నిద్ర శరీరానికి స్వాంతనను, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.
ఇవన్నీ నిపుణుల మాటలు. మార్చి 17 న ప్రపంచ నిద్ర దినోత్సవంగా జరుపుకుంటారు.
ఆరోగ్యకరమైన నిద్ర యొక్క ప్రయోజనాలను తెలియజేస్తూ, నిద్ర సమస్యలపై అవగాహన పెంచడానికి ప్రయత్నంలో భాగమే ఈ ప్రపంచ నిద్ర దినోత్సవ ఉద్దేశం.
ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే సంస్థ ఓ వినూత్న నిర్ణయం తీసుకొంది. మార్చి 17 న ఉద్యోగులకు ఐచ్ఛిక సెలవును ప్రకటించింది.
తన సిబ్బందికి ఆరోగ్యకర జీవనాన్ని అలవర్చే దిశగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ వెల్లడించింది. ఈ విషయాన్ని సదరు సంస్థ లింక్డిన్‌లో పోస్టు చేసింది.
‘ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా మార్చి 17, 2023 న వేక్‌ఫిట్ సొల్యూషన్స్ ఉద్యోగులందరికీ ఒకరోజు విశ్రాంతి ఇస్తున్నాం.
ఆ లాంగ్ వీకెండ్‌లో తగినంత సేదదీరడానికి ఇది సరైన అవకాశం’ అని ఉద్యోగులకు సంస్థ మెయిల్‌ను పంపింది.
ఆ మెయిల్‌ను ‘Surprise Holiday: Announcing the Gift of Sleep’ పేరుతో పంపింది. పరుపులు, సోఫాలు విక్రయించే ఈ సంస్థ ఇలా ఉద్యోగులకు నిద్రను కానుకగా ఇచ్చింది.
‘గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డు పేరిట ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో 2022 నుంచి చూస్తే పని చేసే సమయాల్లో నిద్రముంచుకు వచ్చే వారి సంఖ్య 21 శాతం పెరిగినట్లు తేలింది.
అలసటతో నిద్ర లేచేవారు 11 శాతం పెరిగింది.
ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో ఈ నిద్రలేమి పరిస్థితులను తీసుకుంటే ‘నిద్ర బహుమతి’ కి మించిందేముంది. నిద్ర ప్రియులుగా ఈ రోజును మేం ఓ పండుగగా పరిగణిస్తాం.
ఇక ఆ రోజు శుక్రవారం వస్తే అంతకు మించిన ఆనందం ఏముంటుంది’ అని వేక్‌ఫిట్ సందేశంలో పేర్కొంది.
ఇలా ఉద్యోగులకు ఉపయోగపడే అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం ఈ సంస్థకు కొత్తేం కాదు.
గతంలో ‘రైట్ టు న్యాప్’పాలసీని కూడా తీసుకు వచ్చింది. పనివేళల్లో కంపెనీ ఉద్యోగులు అరగంట పాటు నిద్రపోవడానికి అనుమతినిచ్చింది.