Vande Bharat Express: ఉదయపూర్- జైపూర్ మధ్య ప్రయాణిస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. రైలు పట్టాల వెంబడి ఇటుక సైజులో ఉన్న రాళ్లను గమనించిన లోకోపైలట్ చాకచక్యంగా వ్యవహరించి ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రాళ్లు అమర్చి ఉన్న చోటుకు ముందే రైలు ఆగింది. రైల్వే సిబ్బంది ఈ రాళ్లను తొలగిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో..( Vande Bharat Express)
సోమవారం ఉదయం సుమారు 7.50 ప్రాంతంలో ఉదయపూర్ నుంచి జైపూర్ వెళ్తున్న వందే భారత్ రైలు లోకో పైలట్ చాలా దూరం నుంచే ప్రమాదాన్ని పసిగట్టారు. చిట్టోగఢ్ వద్ద గాంగ్రార్ సోనియానా స్టేషన్ల మధ్య పట్టాలపై రాళ్లు ఉండటాన్ని గమనించి వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో రైలు అక్కడి వరకు వెళ్లకుండానే ఆగింది. లోకోపైలట్ సహా కొంతమంది రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి ఆ రాళ్లను, జాయింట్ వద్ద ఉన్న రాడ్డును తొలగించారు. వాటితో పాటు పట్టాలను వదులు చేసే పరికరం ఉండటాన్ని గమనించి దాన్ని కూడా తొలగించారు. నిందితులెవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదని రైల్వే అధికారులు హెచ్చరిస్తున్నారు.
అనంతరం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణం యధాతధంగా కొనసాగింది. రైల్వే సిబ్బంది రాళ్లను తొలగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో సంచలనంగా మారింది. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ రైలు 435 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6 గంటల 15 నిముషాల్లో చేరుకుంటుంది. గతంలో ఇదే దూరం ప్రయాణించడానికి కనీసం 7 గంటల సమయం పట్టేది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్ధ్యమున్న ఈ రైలును సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.