Electronic surveillance system for India Boarders said by Union Home Minister Amit Shah: దేశ సరిహద్దుల్లో చొరబాట్లను నివారించేందుకు కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థను మోహరిస్తున్నట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల చొరబాట్లకు అడ్డుకట్ట, భూగర్భ సొరంగాలను గుర్తించి ధ్వంసం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని తెలిపారు. జమ్మూకశ్మీర్ హీరానగర్ సెక్టార్‌లోని బీఎస్‌ఎఫ్ బోర్డర్ ఔట్‌పోస్ట్ ‘వినయ్’ను సందర్శించారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి అమిత్ షా మాట్లాడారు.
సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం..
సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు రెండు నమూనాల ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలను అభివృద్ధి చేశామన్నారు. వాటి ఏర్పాటు అనంతరం సమాచార సేకరణ, శత్రువుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం సులభతరం అవుతుందని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చొరబాట్లు, సొరంగాలను గుర్తించేందుకు అనేక పరీక్షలు నిర్వహించామన్నారు. కొన్నేళ్ల తర్వాత ఇండియా-పాకిస్థాన్, భారత్- బంగ్లాదేశ్ సరిహద్దులు పూర్తిస్థాయిలో సాంకేతికత నిఘాలో ఉంటాయని అమిత్ షా తెలిపారు. భద్రతకు సంబంధించి 26కు పైగా ప్రాజెక్టులు ప్రస్తుతం పరీక్ష దశలో ఉన్నాయని స్పష్టం చేశారు. వాటిలో యాంటీ-డ్రోన్ టెక్నాలజీ కూడా ఉందని చెప్పారు. వచ్చే మార్చిలోగా సానుకూల ఫలితాలు సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
వినయ్ ప్రసాద్‌కు నివాళి..
పర్యటనలో భాగంగా కఠువా జిల్లాలో 2019లో అమరుడైన బీఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ వినయ్ ప్రసాద్‌కు అమిత్ షా నివాళులర్పించారు. బీఎస్‌ఎఫ్ సిబ్బంది త్యాగాలు, శౌర్య పరాక్రమాలను ప్రశంసించారు. దేశ భద్రత విషయానికి వస్తే బీఎస్‌ఎఫ్‌కు ఘన చరిత్ర ఉందని తెలిపారు. విపత్కర వాతావరణ పరిస్థితులు, భౌగోళిక సవాళ్లను ఎదుర్కొంటూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహిస్తారని తెలిపారు. భద్రతా బలగాలు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. స్థానికంగా రూ.47 కోట్లతో నిర్మించిన మౌలిక సదుపాయాలను ప్రారంభించారు.