One Nation.. One Election panel: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ కమిటీ సభ్యులను ప్రకటించింది. ఈ కమిటీకి అధ్యక్షులుగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు బాధ్యతలు అప్పగించింది.ఇక హై లెవర్ కమిటిలో సభ్యులుగా.. అమిత్ షా, అధీర్ రంజన్ చౌదరి,గులాంనబీ ఆజాద్, ఎన్‌కె సింగ్, హరీష్ సాల్వే, సుభాష్ కశ్యప్‌లను నియమించింది. ఇక లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించేందుకు ఈ కమిటీ కసరత్తులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ నెల 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరపాలని కేంద్రం నిర్ణయించడంతో అప్పటి నుంచీ దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలు నడుస్తున్నాయి.
జమిలి ఎన్నికలకోసమేనా? (One Nation.. One Election panel)
మరీ ముఖ్యంగా జమిలి ఎన్నికల కోసమే ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇండియా కూటమిలోని పార్టీల్లో ప్రకంపనలు రేపుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేయడంతో జమిలి ఎన్నికల కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయని సంకేతాలందుతున్నాయి. ఇండియా కూటమిలోని పార్టీలు అనేక రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాలుగా ఉన్నాయి. కేంద్రంలో బీజేపీని మూడోసారి అధికారంలోకి రాకుండా ఓడించేందుకు లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు చేసుకున్నా కూడా.. అసెంబ్లీ ఎన్నికలకు సీట్ల సర్దుబాటుకు ఈ పార్టీల మధ్య అవగాహన కుదరేలా కనిపించడం లేదు.
పంజాబ్, ఢిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఇండియా కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక పంజాబ్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంది. లోక్‌సభ ఎన్నికల విషయంలో సీట్ల సర్దుబాటు చేసుకున్నా అసెంబ్లీ ఎన్నికలకు ఈ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కుదరదు. ఇక కేరళలో లెఫ్ట్ కూటమి అధికారంలో ఉంటే కాంగ్రెస్ కూటమి ప్రతిపక్షంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వీరి మధ్య అవగాహన ఎలా కుదురుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ అధికారంలో ఉంది. కాంగ్రెస్, వామపక్షాలు ప్రతిపక్షాలుగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇండియా కూటమి తరపున ఎలాగోలా సీట్ల సర్దుబాటు చేసుకున్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా సర్దుబాటు చేసుకుంటారనేది అంతుబట్టని వ్యవహారంగా మారే అవకాశం కనిపిస్తోంది.