Rice Exports: కేంద్రం గురువారం నాడు నాన్ బాస్మతి అంటే తెల్లబియ్యం ఎగుమతిని నిషేధించింది. దీంతో గ్లోబల్ ఫుడ్ మార్కెట్లో ద్రవ్యోల్బణం పెరిగిపోతుందన్న ఆందోళన మొదలైంది. వచ్చే ఏడాది లోకసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ద్రవ్యోల్బణం అదుపులో ఉంచడానికి కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే కేంద్రప్రభుత్వం వివరణ మాత్రం వేరుగా ఉంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి పంట భారీగా దెబ్బతిందని, దీంతో బియ్యం ధరలు మూడు శాతం వరకు పెరిగాయని వివరణ ఇచ్చుకుంది.
ఇక మన ఇండియా విషయానికి వస్తే గ్లోబల్ మార్కెట్లో జరిగే ఎగుమతుల్లో మన దేశం వాటానే సుమారు 40 శాతం ఆక్రమిస్తోంది. అయితే బియ్యం నిల్వలు కూడా క్రమంగా తగ్గిపోవడం… దీంతో పాటు ఎగుమతులపై కోత విధిస్తే గ్లోబల్ మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఏడాది రష్యా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన వెంటనే ఉక్రెయిన్ నుంచి గోధుమ ఎగుమతి నిలిచిపోయింది. అప్పడు గ్లోబల్ మార్కెట్లో గోధుమ ధరలు చుక్కలనంటాయి. దేశీయ మార్కెట్లో బియ్యం పుష్కలంగా అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బియ్యం ఎగుమతులను నిలుపుదల చేస్తూ భారత ప్రభుత్వం ఎగుమతుల విధానాన్ని సవరించింది. దీనికి కేంద్ర ఆహారమంత్రిత్వశాఖ వివరణ కూడా ఇచ్చింది. గత 12 నెలల కాలంలో బియ్యం రిటైల్ ధరలు 11.5 శాతం వరకు పెరిగాయని తెలిపింది. గత ఏడాది మన దేశం నుంచి 22 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతులు జరిగితే వాటిలో నాన్ బాస్మతి వైట్ బ్రోకన్ రైస్ సుమారు 10 మిలియన్ టన్నుల వరకు ఆక్రమించాయని పేర్కొంది.
కాగా ప్రభుత్వం గురువారం అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటనలో పారాబాయిల్డ్ రైస్ అంటే ఉడకబెట్టిన బియ్యం గత ఏడాది అంటే 2022లో 7.4 మిలియన్ టన్నుల వరకు జరిగాయని.. అయితే ఈ బియ్యం ఎగుమతులపై ఎలాంటి నిర్బంధాల్లేవని తెలిపింది. అయితే ప్రభుత్వం ముందు చూపుతో వచ్చే ఏడాది జరిగే లోకసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ద్రవ్యోల్బణం పెరగకుండా అదుపులో ఉంచేందుకు ఎగుమతులపై నిషేధించింది. అలాగే మోదీ సర్కార్ గోధుమ ఎగుమతులో పాటు చక్కెర ఎగుమతులపై కూడా ఆంక్షలు విధించింది. ఈ సారి పంట దిగుబడి తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.