Arvind Kejriwal Bail: ఆమ్ ఆద్మీ చీఫ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో భారీ ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో పాటు కేజ్రీవాల్ వచ్చే లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి అనుమతించింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జడ్జిలు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్‌కు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ముందు జూన్ 2వ తేదీన స్వచ్చందంగా లొంగిపోవాలని కేజ్రీవాల్‌ను ఆదేశించింది.
కోర్టు నిబంధనలు..(Arvind Kejriwal Bail)
కాగా మధ్యంతర బెయిల్ లభించిన వెంటనే ఆయన లోకసభ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అయితే బెయిల్‌కు సంబంధించి జడ్జిలు కొన్ని కండిషన్‌లు పెట్టారు. వాటిలో ఆయన ప్రధానంగా అధికార విధులకు దూరంగా ఉండాలనేది ప్రధాన షరతుగా కనిపిస్తోంది. కాగా గత కొన్ని రోజుల నుంచి సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ఈ నెల 7వ తేదీన సుప్రీంకోర్టు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఆర్డర్‌ను రిజర్వులో పెట్టింది. లోకసభ ఎన్నికల నేపథ్యంలో తనను ప్రచారానికి అనుమతించాలని కేజ్రీవాల్ పిటిషన్ పెట్టుకోగా.. ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. చట్టం ముందు అందరు సమానమేనని ఈడీ తరపు న్యాయవాది రాజు వాదించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన రిమాండ్‌లో ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఆయనకు 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏడవ విడత లోకసభ పోలింగ్ ముగిసిన వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. కాగా శుక్రవారం కోర్టులో జరిగిన వాదోపవాదాల సందర్భంగా కూడా జడ్జిలు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడానికే మొగ్గు చూపారు. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా నేరాలు చేసే వ్యక్తి కాదని కూడా ఈడీ దృష్టికి తెచ్చింది కోర్టు. కేజ్రీవాల్ వ్యక్తిగత స్వేచ్చ కూడా ముఖ్యమని పలుమార్లు ప్రస్తావించింది. ఎట్టకేలకు కేజ్రీవాల్ బెయిల్ లభించడంతో ఆప్ కార్యకర్తల్లో నూతనోత్సాహం పెల్లుబికింది. కొత్త జోష్‌తో ఢిల్లీ లోకసభ ఎన్నికల ప్రచారంలో ఇక కేజ్రీవాల్ పాల్గొనబోతున్నారు. కాగా ఢిల్లీలో నాలుగు పార్లమెంటు స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తుండగా.. మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తోంది.