Stalin: తమిళనాడు ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ రాకుండా తలుపులు మూసి వేసింది. తమిళనాడులోని ఏ కేసుకు సంబంధించైనా దర్యాప్తు చేసుకునేందుకు గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని స్టాలిన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాల్సి వచ్చినపుడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
10 రాష్ట్రాల్లో సీబీఐ నో ఎంట్రీ(Stalin)
కాగా, గతంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడు మంత్రి వి.సెంథిల్ బాలాజీని మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టు చేసింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మోదీ ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందంటూ తీవ్ర ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలోని 9 రాష్ట్రాలు సీబీఐకి జనరల్ కన్సెంట్‌ను ఉపసంహరించుకున్నాయి. ఆ లిస్ట్ లో తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కేరళ, జార్ఖండ్, పంజాబ్, మేఘాలయ, మిజోరాం రాష్ట్రాలు ఉన్నాయి. తాజాగా తమిళనాడు కూడా చేరింది.
కోర్టుల ఆదేశాలతో
కాగా సీబీఐ పాలనా వ్యవహారాలు.. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కింద జరుగుతున్నాయి. ఈ చట్ట ప్రకారం ఢిల్లీ పోలీస్‌లకు సీబీఐ ప్రత్యేక విభాగంగా ఉంది. ఈ పరిధి కూడా ఢిల్లీకే పరిమితమై ఉంది. వేరే రాష్ట్రాల వ్యవహారాల్లో దర్యాప్తు చేయాలంటే.. సంబంధిత రాష్ట్రం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం సీబీఐ పరిధి పరిమితంగానే ఉంటుంది. కానీ, ఏ రాష్ట్రంలోనైనా విచారణ చేపట్టమని సుప్రీంకోర్టు, హైకోర్టు లు సీబీఐని ఆదేశించవచ్చు. ఇందు కోసం రాష్ట్రాల అనుమతి అవసరం ఉండదు.
తాజాగా సీబీఐకి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఉపసంహరించుకున్నప్పటికీ.. ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న కేసులను కొనసాగించవచ్చు. అయితే ఈ కేసుల విషయంలో కూడా రాష్ట్రం ప్రభుత్వం సమ్మతిని రద్దు చేసుకుంటే సీబీఐ దర్యాప్తు చేపట్టకుండానే వెనుదిరగాల్సి ఉంటుంది. అయితే కోర్టు ఆదేశాలతో మాత్రం విచారణ చేపట్టేందుకు వెసులుబాటు ఉంటుంది.