Regional Languages: కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ విభాగం మంగళవారం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మల్టీ టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్ (SSC MTS) పరీక్ష, మరియు CHSLE ఎగ్జామినేషన్లను హిందీ మరియు ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలనే నిర్ణయాన్ని ఆమోదించింది. అసోమీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి (మీతీ కూడా) మరియు కొంకణి తదితర 13 ప్రాంతీయ భాషల్లో కూడా ప్రశ్నపత్రం సెట్ చేయబడుతుందని అధికారిక ప్రకటనలో తెలిపింది.
ఇంగ్లీష్ మరియు హిందీ కాకుండా ఇతర భాషలలో SSC పరీక్షలను నిర్వహించాలని వివిధ రాష్ట్రాల నుండి నిరంతర డిమాండ్లు ఉన్నాయి. ఇతర విషయాలతోపాటు ఈ అంశాన్ని కూడా పరిశీలించడానికి ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది అభ్యర్థులు తమ మాతృభాష/ప్రాంతీయ భాషలో పరీక్షలో పాల్గొంటారు. వారి ఎంపిక అవకాశాలను మెరుగుపడతాయని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు & పెన్షన్ల మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ నిర్ణయం చారిత్రాత్మకమని పేర్కొన్నారు.స్థానిక యువత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి మరియు ప్రాంతీయ భాషలను ప్రోత్సహించడానికి ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో ఇది తీసుకున్నట్లు తెలిపారు.రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌లో జాబితా చేయబడిన అన్ని భాషలను చేర్చడానికి మంత్రిత్వ శాఖ ప్రయత్నాలు చేస్తోందని సింగ్ పేర్కొన్నారు. పరీక్షల కోసం అనేక రాష్ట్రాల నుండి, ముఖ్యంగా దక్షిణ భారతదేశం నుండి అభ్యర్థుల దీర్ఘకాలిక అభ్యర్థనలను ఈ చర్య సంతృప్తిపరుస్తుందని అన్నారు. గతంలో ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఈ పరీక్ష నిర్వహించబడింది.
SSC MTS పరీక్ష అనేది ప్యూన్, గార్డనర్, సహా భారత ప్రభుత్వ వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖలు మరియు కార్యాలయాలలో జనరల్ గ్రూప్-సి సెంట్రల్ సర్వీస్ నాన్ మినిస్టీరియల్ మరియు నాన్ గెజిటెడ్ పోస్టులలో సిబ్బంది నియామకాన్ని నిర్వహించడానికి SSC నిర్వహించే నాన్-టెక్నికల్ పరీక్ష. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF) లేదా సెంట్రల్ పారామిలిటరీ బలగాలలో కానిస్టేబుళ్ల (జనరల్ డ్యూటీ) రిక్రూట్‌మెంట్ పరీక్షను హిందీ మరియు ఇంగ్లీషుతో పాటు 13 ప్రాంతీయ భాషలలో నిర్వహించాలని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) శనివారం నిర్ణయించిన విషయం తెలిసిందే.