Seema Haider : పబ్జీ గేమ్‌లో మొదలైన పరిచయంతో.. మన దేశ యువకుడిని ప్రేమించి పాకిస్థాన్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ కేసు వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రేమ కోసం దేశ సరిహద్దులు దాటి భర్తను వదిలేసి.. నలుగురు పిల్లలతో కలిసి భారత్ వచ్చింది సదరు మహిళ. ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడు సచిన్ మీనా అనే వ్యక్తితో పెళ్లి కూడా చేసుకుంది. అయితే ఈ ఘటనపై మొదట నుంచి పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
దుబాయ్, నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా.. పాక్ గూఢచారి అయి ఉంటుందని భావిస్తున్నారు. దాంతో ఆమెతో పాటు ఆమెకు ఆశ్రయం ఇచ్చిన సచిన్ మీనా, ఆయన తండ్రిని ఈ నెల 4న నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారంతా బెయిలుపై విడుదలయ్యారు. కాగా ఇప్పుడు యూపీ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) వారిని రహస్య ప్రదేశంలో విచారిస్తోంది. నిన్న రెండో రోజు విచారణలో పలు షాకింగ్ విషయాలు బయటపడినట్టు సమాచారం అందుతుంది.
సీమా హైదర్ చిన్నాన్న, ఆమె సోదరుడు పాకిస్థాన్ సైన్యంలో పనిచేస్తున్నట్టు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అలాగే, భారత్‌లో ప్రవేశించిన తర్వాత సచిన్ మీనాను కలవడానికి ముందు ఢిల్లీలో ఆమె మరికొందరిని కలిసినట్టు అనుమానిస్తున్నారు. పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో లక్నోలో ఓ అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాతే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.
మరీ ముఖ్యంగా అధికారులు అడిగిన ప్రశ్నలకు ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నట్టు చెప్పిన ఆమె ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతున్నారని తెలుస్తుంది. మరోవైపు, ఆమె పాక్ ఏజెంట్ అని, తిరిగి పాక్ కు పంపాలంటూ గుర్తు తెలియని వ్యక్తులు ముంబై పోలీసులకు మెసేజ్ చేయడం కూడా అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ప్రేమ పేరుతో భారతదేశంలోకి ప్రవేశించిన పాకిస్థానీ మహిళ సీమా హైదర్ పై చర్య తీసుకోకుంటే ఆమెను పాక్ సరిహద్దుల్లో విసిరేస్తామని కర్ణిసేన హెచ్చరించింది.