Shaktikanta Das: చలామణి నుంచి రూ. 2 వేల నోటును వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ స్పందించారు. నగదు నిర్వహణలో భాగంలోనే రూ. 2 వేల నోటును ఉపసంహరించుకున్నట్టు ఆయన తెలిపారు. 2016 నోట్ల రద్దు తర్వాత వ్యవస్థలోకి నగదును వేగంగా పంపించే భాగంలోనే రూ. 2 వేల నోటును తీసుకొచ్చినట్టు చెప్పారు. కాగా మే 23 నుంచి 2000 వేల నోట్ల మార్పిడి మొదలుకానున్న నేపథ్యంలో.. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఇప్పటికే బ్యాంకులకు మార్గదర్శాకాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు.
నోట్ల రద్దు అనేది ఆర్బీఐ సాధారణంగా చేపట్టే కరెన్సీ మేనేజ్ మెంట్ చర్యల్లో భాగమేనని.. క్లీన్ నోట్ పాలసీ అనేదీ ఆర్బీఐ ఎప్పటి నుంచో అమలు చేస్తుందని ఆయన వివరించారు. వివిధ డినామినేషన్ నోట్లలో కొన్ని సిరీస్ లు ఆర్బీఐ అప్పుడప్పుడూ వెనక్కి తీసుకుని.. కొత్త సిరీస్ లను విడుదల చేస్తుందన్నారు. అదే విధంగా రూ. 2 వేల నోట్ల వెనక్కి తీసుకున్నట్టు తెలిపారు. అయితే అవి చెల్లుబాటులో ఉంటాయని వివరించారు.
కాగా, సెప్టెంబర్ 30 నాటికి చాలా వరకు రూ. 2 వేల నోట్లు ఖజానాకు చేరతాయని ఆశిస్తున్నట్టు శక్తికాంత దాస్ తెలిపారు. నోట్ల మార్పిడి వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆర్బీఐ అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. బ్యాంకుల వద్ద హడావిడి పడాల్సిన అవసరం లేదని .. మార్పిడికి నాలుగు నెలల సమయం ఉందని సూచించారు. గత కొంత కాలం నుంచే చాలామంది వ్యాపారస్తులు రూ. 2 వేల నోటును తీసుకోవడం లేదని.. ఇపుడు అది మరింత ఎక్కువై ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
#WATCH | #Rs2000CurrencyNote | RBI Governor Shaktikanta Das says, “Let me clarify and re-emphasise that it is a part of the currency management operations of the Reserve Bank…For a long time, the Reserve Bank has been following a clean note policy. From time to time, RBI… pic.twitter.com/Rkae1jG0rU
— ANI (@ANI) May 22, 2023
మరో వైపు రూ. 50 వేల కంటే ఎక్కువ మొత్తం డిపాజిట్ చేస్తే.. అందుకు పాన్ కార్డు సమర్పించాలనే నిబంధన ఎప్పటి నుంచో ఉందని ఆయన గుర్తు చేశారు. అది రూ. 2 వేల నోట్లకు వర్తిస్తుందని తెలిపారు. రేపటి నుంచి జరిగే మార్పిడి కోసం.. ఇతర నోట్లను సరిపడినంతా అందుబాటులో ఉంచామన్నారు. ఈ తాజా ఉపసంహరణ వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చాలా తక్కువన్నారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. 2000 వేల నోట్ల వాటా కేవలం 10.18 శాతం మాత్రమేనని ఆయన తెలిపారు. అయితే మళ్లీ రూ. 1000 నోట్లను తిరిగి తెస్తున్నారనే వార్తలు ఊహాగానాలే అని కొట్టి పారేశారు.
గుర్తింపు కార్డులు లేకుండా డిపాజిట్లను అనుమతి ఇచ్చినపుడు..బ్లాక్ మనీని ఎలా గుర్తిస్తారనే ప్రశ్నకు శక్తి కాంత్ దాస్ స్పందించారు. డిపాజిట్ల విషయంలో ఇప్పటికే ఫాలో అవుతున్న నిబంధనలనే రూ. 2,000 నోట్ల విషయంలోనూ వర్తింప జేయాలని బ్యాంకులకు సూచించినట్టు తెలిపారు. ఎక్కువ మొత్తంలో అయ్యే డిపాజిట్ల తనిఖీ అంశాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుందన్నారు. ఈ విషయంలో బ్యాంకులకు నిర్దిష్టమైన నిబంధనలను ఉన్నాయని.. వాటినే ప్రస్తుతం అమలు చేస్తాయని స్పష్టం చేశారు.
2016 నోట్ల రద్దు సమయంలో సామాన్యులు పడిన ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని.. ప్రస్తుతం నోట్ల మార్పిడి కి తగిన ఏర్పాట్లు చేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. ఈ క్రమంలో నోట్ల మార్పిడి కోసం ప్రజల కోసం నీరు, నీడ లాంటి వసతులు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించింది. ముఖ్యంగా వేసవి కావున సామాన్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని తెలిపింది. బ్యాంకులోని అన్ని కౌంటర్లలో నోట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించాలని సూచించింది.