Severe Heatwave: దేశవ్యాప్తంగా భానుడు భగభగ మండుతున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 10.4 డిగ్రీల ఎక్కువగా నమోదు అవుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతలు మాత్రం తూర్పు ఇండియాతో పాటు పశ్చిమబెంగాల్‌లో నమోదవుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని కలైకుండాలో గరిష్ఠ ఉష్ణోగ్రత 47.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది. సాధారణ ఉష్ణోగ్రత కంటే ఇది 10.4 డిగ్రీల సెల్సియస్‌ఎక్కువ. తర్వాత స్థానంలో జార్ఖండ్‌లోని బహ్రగోరాలో 47.1 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, కోలకతా నగరంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దేశంలోని తూర్పు ప్రాంతంలో వేడి గాలులకు ప్రజలు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. సాధారణ ఉష్ణోగ్రతతో పోల్చుకుంటే పలు రెట్లు ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతోంది.
కోలకతాలో ఎక్కువగా హీట్‌వేవ్ ..(Severe Heatwave)
పశ్చిమ బెంగాల్, బిహార్, సబ్ హిమాలయన్ పశ్చియ బెంగాల్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయని వార్తలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని కోలకతాలో హీట్‌వేవ్ ఎక్కువగా ఉంది. సిటీ ఆఫ్ జాయ్‌గా పిలవబడే కోలకతా నగరంతో పాటు డమ్ డమ్, ఉలుబెరియాలో పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోతోంది. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే ఇక్కడ ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఇంటి నుంచి కాలు బయటపెట్టాలంటే హడలిపోతున్నారు. సింగభూమ్ జిల్లాలోని బహ్రగోరాలో ఉష్ణోగ్రత 47.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇక ఒడిషాలోని బారాపాడ, బాలాసోర్‌లలో వరుసగా గరిష్ఠ ఉష్ణోగ్రత 46.4 డిగ్రీలు, 46.0 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. మండుతున్న ఎండలకు ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి అడుగు బయటపెట్టడం లేదు.
అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న రాష్ర్టాల్లో బిహార్ కూడా ఒకటి. ఇక్కడ పగటి ఉష్ణోగ్రత 41.2 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. ఇక తెలుగు రాష్ర్టాల విషయానికి వస్తే తెలంగాణను చెప్పుకోవచ్చు. తెలంగాణలోని రామగుండాన్ని తీసుకుంటే ఇక్కడ 44.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దేశంలోని పశ్చిమ బెంగాల్‌లో, బిహార్, జార్ఖండ్‌తో పాటు కొంకన్ ప్రాంతాల్లో కూడా ఎండలు మండిపోతున్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.