Sedition law: రాజద్రోహం కేసులపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజద్రోహం చట్టంపై మళ్లీ సమీక్ష చేస్తామని కేంద్రం చెప్పింది. రానున్న వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ముందుకు రాజ ద్రోహం చట్టం సవరణ బిల్లును తెస్తామని తెలిపింది. దీంతో రాజద్రోహం కింద నమోదైన కేసులను ఆగస్టు రెండో వారంలో విచారిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
ఆగస్టుకు వాయిదా వేస్తూ..(Sedition law)
కాగా.. బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహ చట్టం చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ సహా మొత్తం 16 పిటిషన్లు కోర్టులో దాఖలయ్యాయి. అయితే ఈ అంశంపై కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపాలని గత ఏడాది మేలో సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజద్రోహం చట్టం, ఈ అంశం కింద నమోదైన కేసులపై స్టే విధిందించింది. అయితే ఈ చట్టాన్ని పునర్ పరిశీలించేందుకు మరింత గడువు కావాలని కేంద్రం గత ఏడాది అక్టోబర్ 31న కోరింది. ఇప్పుడు మళ్లీ కేంద్రం మరింత సమయం కావాలని అడిగింది. దీంతో తదుపరి విచారణను ఆగస్టుకు వాయిదా వేస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది .
అత్యంత వివాదాస్పదమైన రాజద్రోహ చట్టంపై దేశ సర్వోన్నత న్యాయన్థానం చరిత్రాత్మక నిర్ణయాన్ని వెలువరించింది. ఈ నేరారోపణతో జైళ్లలో మగ్గుతున్న వారికి ఊరట కల్పించింది. సుప్రీం నిర్ణయంతో విచక్షణా రహితంగా నమోదుకానున్న కేసులకు కట్టడి చేసినట్టు అయింది. భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 124ఎ నిబంధనపై కేంద్ర ప్రభుత్వం పున సమీక్ష జరిపి తదుపరి నిర్ణయం తీసుకునేంత వరకు దాని అమలును నిలిపేస్తూ 2022 మే 11 న కీలకమైన ఆదేశాలిచ్చింది.