Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు వందలాది కోట్లు ఖర్చు చేస్తున్నాయి. మద్యాన్ని ఏరులై పారిస్తున్నాయి. విచ్చలవిడిగా డబ్బు పంచిపెడుతున్నాయి. కొందరికి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నాయి. ఎన్నికల సంఘం చేసిన విస్తృత సోదాల్లో ఇప్పటి వరకు మొత్తం 375 కోట్లు విలువ చేసే మద్యం, డ్రగ్స్, నగదు, వస్తువులు పట్టుబడ్డాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
2018తో పోల్చితే నాలుగు రెట్లు..(Karnataka Elections)
అధికారులు విడుదల చేసిన అధికారిక గణాంకల ప్రకారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న సొమ్ము విషయానికి వస్తే నగదు 147.46 కోట్లు కాగామద్యం విలువ 83.66 కోట్లు, డ్రగ్స్ విలువ 23.67 కోట్లు, వస్తువుల విలువ 96.6 కోట్లు, ఉచితంగా పంపిణీ చేసిన వాటి విలువ 24.21 కోట్ల వరకు ఉన్నాయని ఒక ప్రకటనలో తెలిపింది.దీనితో ఎన్నికల సంఘం సోదాల్లో ఇప్పటివరకు మొత్తం 375.61 కోట్లు పట్టుబడినట్లయింది. అధికారికంగా సీజ్ చేసిన మొత్తమే ఇన్ని కోట్లు ఉంటే.. ఇక అనధికారంగా ఎంత ఖర్చు చేసి ఉంటారనే అంశం చర్చనీయాంశమైంది. కాగా.. 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 83.93 కోట్లు పట్టుబడితే… ఈసారి ఆ మొత్తం నాలుగు రెట్లకు పైగా పెరగడం గమనార్హం.
కాంగ్రెస్ నేతలపై బీజేపీ పరువు నష్టం దావా..
మరోవైపు కర్ణాటకలో బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ స్థానిక, జాతీయ పత్రికల్లో ‘అవినీతి రేటు కార్డు’ అంటూ ప్రకటనలు ఇచ్చింది. దీంతో, ఈ విషయాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. దీనికి సంబంధించిన ఆధారాలను చూపించాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, సిద్ద రామయ్య, డీకే శివ కుమార్‌కు బీజేపీ.. క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేసింది. అయితే, మే 5వ తేదీన పలు దినపత్రికల్లో బీజేపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ ప్రకటనలు ఇచ్చింది. 40 శాతం కమిషన్ దండుకుందని… అలాగే, బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్లలో ప్రజల నుండి 1.5 లక్షల కోట్లకు పైగా దోచుకుంది అని పేర్కొంది. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ ప్రకటనను ఉపసంహరించుకోవాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని బీజేపీ.. ముగ్గురు కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ, ప్రకటనలను ఉపసంహరించుకోలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ తాజాగా కాంగ్రెస్ నాయకులపై క్రిమినల్ పరువు నష్టం వేసింది.