Site icon Prime9

China G20 Delegate: ఢిల్లీ హోటల్లో G20 చైనా ప్రతినిధి బృందం హై డ్రామా.. . బ్యాగుల తనిఖీకి ససేమిరా

China G20 Delegate

China G20 Delegate

China G20 Delegate:  G20 సదస్సుకోసం ఢిల్లీకి వచ్చిన చైనా ప్రతినిధి బృందం భద్రతా సిబ్బందిచే బ్యాగ్‌ని తనిఖీ చేయడానికి నిరాకరించిందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఢిల్లీలోని ఫైవ్ స్టార్ హోటల్లో ఇది జరిగింది.

చైనా ఎంబసీకి చేరిన బ్యాగులు..(China G20 Delegate)

నగరంలోని చాణక్యపురి  తాజ్ ప్యాలెస్ హోటల్‌లో చైనా ప్రతినిధులు బస చేశారు. చైనా ప్రతినిధి బృందం హోటల్‌కు ఒక బ్యాగ్‌ని తీసుకొచ్చింది. బ్యాగ్‌ని తనిఖీ చేయాలని భద్రతా సిబ్బందిని కోరగా, వారు అందుకు నిరాకరించారని పోలీసు వర్గాలు తెలిపాయి. భద్రతా నియమావళి ప్రకారం బ్యాగ్‌ను తనిఖీ చేయాలని పోలీసులు పదేపదే పట్టుబట్టినప్పటికీ చైనా ప్రతినిధులు అంగీకరించకపోవడంతో గందరగోళం చెలరేగింది. చివరకు, ప్రతినిధి బృందం బ్యాగ్‌ని తనిఖీ చేయకుండానే చైనా రాయబార కార్యాలయానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బ్యాగ్‌లో ఏమున్నాయనే విషయం తెలియలేదు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బస చేసిన ప్రదేశానికి సమీపంలో ఈ హోటల్ ఉంది. బ్రెజిల్ ప్రధాన మంత్రికి కూడా అదే హోటల్‌లో వసతి కల్పించారు. చైనా అధికారులు తమ బ్యాగులను భద్రతా తనిఖీలు చేయకుండానే సెప్టెంబర్ 10న హోటల్ నుండి బయలుదేరారు. ఈ బ్యాగులు ప్రస్తుతం ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయ ప్రాంగణంలో ఉన్నట్లు సమాచారం.

ఇలా ఉండగా అనుమానాస్పద బ్యాగ్‌లో ఏమున్నాయనే దానిపై భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. గదుల్లోని నిఘా పరికరాలను గుర్తించి, నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించే డీ-బగ్గింగ్ పరికరాలు ఇందులో ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కు అంతరాయం కలిగించడానికి రూపొందించిన తాత్కాలిక జామింగ్ పరికరాలు ఇందులో ఉండవచ్చనే ఆందోళనలు ఉన్నాయి. G20 సదస్సులో చైనా తరపున ప్రీమియర్ లీ కియాంగ్ ప్రాతినిధ్యం వహించారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కాలేదు.

 

 

 

Exit mobile version