Ram Temple Consecration: జనవరి 22న జరగనున్న అయోధ్యలోని రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమం ద్వారా లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఎఐటి) నివేదిక వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లోని 30 నగరాల్లోని వర్తక సంఘాల నుండి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ అంచనా వేయబడింది.
సిఎఐటి జాతీయ సెక్రటరీ జనరల్, ప్రవీణ్ ఖండేల్వాల్, ఈ కార్యక్రమం కేవలం మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉండటమే కాకుండా ఆర్థిక కార్యకలాపాల్లో పెరుగుదలకు దారితీస్తుందని చెప్పారు. ప్రజల విశ్వాసం, దేశ సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థ ఆధారంగా కొత్త వ్యాపారాల సృష్టికి దారితీస్తున్నాయి.రామ మందిర ప్రతిష్ఠాపనకు సంబంధించి దేశవ్యాప్తంగా వర్తక సంఘాలు నిర్వహించిన సుమారు 30,000 విభిన్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. వీటిలో మార్కెట్ ఊరేగింపులు, శ్రీరామ్ చౌకీ, శ్రీరామ్ ర్యాలీలు, శ్రీరామ్ పద్ యాత్ర, స్కూటర్ మరియు కార్ ర్యాలీలు మరియు శ్రీరామ్ సమావేశాలు ఉన్నాయి.మార్కెట్లలో శ్రీరామ జెండాలు, బ్యానర్లు, క్యాప్‌లు, టీ షర్టులు, రామాలయం చిత్రపటాన్ని ముద్రించిన ‘కుర్తాలు’ వంటి వాటికి అధిక డిమాండ్ ఉంది. రామమందిర నమూనాలకు డిమాండ్ కూడా పెరిగింది. దేశవ్యాప్తంగా 5 కోట్లకు పైగా ఈ మోడళ్లు అమ్ముడవుతాయని అంచనా. ఈ డిమాండ్‌ను తీర్చడానికి చిన్న తయారీ యూనిట్లు చాలా నగరాల్లో 24 గంటలూ పనిచేస్తున్నాయి.రాబోయే వారంలో, ఢిల్లీలోని 200 కంటే ఎక్కువ ప్రధాన మార్కెట్లు, అనేక చిన్న మార్కెట్లు శ్రీరామ జెండాలతోమ అలంకరించబడతాయి. అంతేకాదు బృందావన్ మరియు జైపూర్ నుండి జానపద నృత్యకారులు మరియు గాయకులతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు ఢిల్లీలోని వివిధ మార్కెట్లలో కూడా నిర్వహించాలని ప్రణాళికలు రూపొందించారు. ఇవన్నీ కూడ సుమారుగా లక్ష కోట్ల రూపాయల వ్యాపారం జరగడానికి దోహదం చేస్తాయని అంచనా వేస్తున్నారు.