LPG cylinder price Reduced: వంటగ్యాస్ సిలెండర్ ధరను తగ్గిస్తూ ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ మంగళవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. సిలెండర్ ధర 200 తగ్గించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మంగళవారంనాడిక్కడ మీడియా సమావేశంలో వెల్లడించారు. డొమిస్టిక్ ఎల్‌పీజీ సిలెండర్ల ధర 200 తగ్గించాలని ప్రధాన మంత్రి మోదీ నిర్ణయం తీసుకున్నారని, రక్షాబంధన్ కానుకగా దేశంలోని మహిళలందరికీ మోదీ ఇచ్చిన కానుక ఇదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ సహా మొత్తం 5 రాష్ట్రాలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఎల్పీజీ సిలెండర్ ధరను కేంద్రం తగ్గించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రస్తుతం ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1053గా ఉండగా, ముంబైలో రూ.1052.50గా ఉంది. చెన్నైలో ధర రూ. 1068.50, కోల్‌కతాలో రూ. 1079గా ఉంది. ముఖ్యంగా, మే నెలలో రెండుసార్లు పెరిగిన తర్వాత, జూలైలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డొమెస్టిక్ ఎల్‌పిజి సిలిండర్‌ల ధరను రూ. 50 పెంచాయి.ప్రస్తుతం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద లబ్ధిదారులకు ఇప్పటికే రూ. 200 సబ్సిడీని పొందుతున్నారు. తాజా ప్రతిపాదనతో వారికి సిలిండర్‌పై రూ. 400 సబ్సిడీ లభిస్తుంది. తాగా తగ్గింపుతో ఉజ్వల వినియోగదారులకు రూ.755కే సిలిండర్ లభించనుండగా, మిగిలిన వినియోగదారులకు రూ.955కు సిలిండర్ లభ్యమవుతుంది.
ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY)ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 1, 2016న ప్రారంభించారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న (BPL) కుటుంబాల మహిళలకు 50 మిలియన్ల ఎల్పీజీ కనెక్షన్‌లను పంపిణీ చేయాలనేది దీని లక్ష్యం.