Prime9

Karnataka : కర్ణాటక సీఎం, గవర్నర్‌ల మధ్య వివాదం.. విజయోత్సవాలకు సీఎం ఆహ్వానించారు : రాజ్‌భవన్

Dispute between Governor and Chief Minister : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఇప్పుడు గవర్నర్‌, ముఖ్యమంత్రిల మధ్య వివాదంగా మారుతోంది. విధాన్‌ సౌధలో జరిగిన కార్యక్రమాన్ని తాము ఏర్పాటు చేయలేదని సీఎం సిద్ధరామయ్య ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కర్ణాటక గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌ను స్వయంగా సీఎం అధికారికంగా కార్యక్రమానికి ఆహ్వానించినట్లు రాజ్‌భవన్‌ ప్రకటించింది.

 

మొదట ఆర్సీబీ బృందానికి రాజ్‌భవన్‌లో ఆతిథ్యం ఇవ్వాలని భావించారు. ఈ అంశంపై గవర్నర్‌ కార్యాలయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సంప్రదించి కార్యక్రమాన్ని సమన్వయపర్చాలని కోరింది. కానీ, దానికి బదులు ప్రభుత్వమే విధాన సౌధలో నిర్వహించాలని నిర్ణయించినట్లు సీఎస్‌ వెల్లడించారు. విధాన సౌధలో నిర్వహించే ఆర్సీబీ ఆటగాళ్ల అభినందన కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్‌ను సీఎం అధికారికంగా ఆహ్వానించారని రాజ్‌భవన్‌ ఒక ప్రకటనలో పేర్కొంది.

 

వ్యవహారంపై కర్ణాటక సర్కారు ఆచితూచి స్పందిస్తోంది. తొక్కిసలాట చిన్నస్వామి స్టేడియం వద్ద చోటుచేసుకుందని, విధానసౌధ వద్ద కార్యక్రమం సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగలేదని చెబుతోంది. ఈ ఘటనను రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు వాడుకొంటున్నాయని ఆరోపించింది. తమ ప్రభుత్వం తొక్కిసలాట కేసును తీవ్రంగా పరిగణిస్తోందని ఇటీవల ముఖ్యమంత్రి తెలిపారు. కార్యక్రమానికి తాను కేవలం ఆహ్వానితుడిని మాత్రమేనని తెలిపారు. రెండు గంటలు ఆలస్యంగా తనకు తొక్కిసలాట సమాచారం అందినట్లు సీఎం పోలీసుల సస్పెన్షన్‌ను సమర్థించుకునేలా చెప్పుకొచ్చారు. విధాన సౌధలో వేడుకకు క్రికెట్‌ వర్గాల నుంచి ఆహ్వానం వచ్చిందని, ప్రభుత్వం తరఫున కాదని పేర్కొన్నారు. తనను స్టేడియం వద్ద కార్యక్రమానికి ఆహ్వానించలేదని చెప్పుకొచ్చారు.

 

ఆర్సీబీ కార్యక్రమానికి ముందే సిబ్బంది, పరిపాలన సంస్కరణల కార్యదర్శి జి.సత్యవతితో సహా పలువురు ఉన్నతాధికారులకు అసెంబ్లీ భద్రతను చూసే డీసీపీ ఎంఎన్‌ కరిబసవన గౌడ ఓ లేఖ రాశారు. అందులో ఆ క్రికెట్ జట్టుకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. విధాన సౌధలో కార్యక్రమం నిర్వహిస్తే లక్షలాది మంది అభిమానులు వచ్చే అవకాశం ఉందని, సిబ్బంది కొరత కారణంగా వారిని నియంత్రించడం కష్టమని ఆ లేఖలో పేర్కొన్నారు. మైదానంలోకి వచ్చేందుకు జారీ చేస్తున్న ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌‌ల్లో లోపలికి వెళ్లే పాస్‌లను నిలిపివేయాలని ఆయన కోరారు. కానీ, ఆర్సీబీ కార్యక్రమం నిర్వహించడం గమనార్హం.

Exit mobile version
Skip to toolbar