Rahul Gandhi: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వచ్చే జనవరి 14నుంచి మరోసారి పాదయాత్ర నిర్వహించనున్నారు. భారత్ న్యాయ యాత్ర పేరిట జనవరి 14నుంచి మార్చి 20 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నెల 21న సమావేశమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మరోసారి రాహుల్ గాంధీ యాత్ర చేయాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
దీనికి అనుగుణంగా రాహుల్ ఈశాన్య రాష్ట్రాలనుంచి ముంబై వరకూ పాదయాత్ర చేయడానికి వీలుగా షెడ్యూల్ ఖరారు చేశారు. రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర 14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల గుండా సాగుతుంది. మణిపూర్, నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రల్లో 6,200 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది.జనవరి 14న మణిపూర్ నుంచి పాదయాత్రను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జెండా ఊపి ప్రారంభించనున్నారు.
ఈ సారి పూర్తి పాదయాత్ర కాకుండా బస్సుల్లో కూడా యాత్ర కొనసాగుతుంది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ బుధవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దక్షిణాదిలోని కన్యాకుమారిలో ప్రారంభమై ఉత్తరాన కాశ్మీర్‌లో ముగిసిన భారత్ జోడో యాత్రను ఆయన చారిత్రక యాత్రగా పేర్కొన్నారు.ఇప్పుడు, రాహుల్ గాంధీ మొదటి భారత్ జోడో యాత్ర నుండి గొప్ప అనుభవంతో యాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర యువత, మహిళలు మరియు అణగారిన ప్రజలతో సంభాషించేలా ఉంటుందని వేణుగోపాల్ అన్నారు.భారత్ జోడో యాత్ర 4,500 కిలోమీటర్లు సాగింది.