Rahul Gandhi Says RSS Attempts To Erase Diverse Histories and Culture: చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, భాషలపై ఆరెస్సెస్ కుట్రలు చేస్తోందని, దేశ ప్రజలను క్రమంగా తన సిద్ధాంతాల దిశగా ఆ సంస్థ నడిపించేందుకు పన్నిన కుట్రలో భాగంగానే యూజీసీ కొత్త నిబంధనలు అమలులోకి తేవాలనే ప్రయత్నం సాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గురువారం యూజీసీ ముసాయిదా నిబంధనలకు వ్యతిరేకంగా డీఎంకే విద్యార్థి విభాగం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ నిరసనలో డీఎంకే ఎంపీ కనిమొళి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ముందే హెచ్చరించా…
కేంద్రం తీసుకొచ్చిన యూజీసీ ముసాయిదా అనేది కేవలం విద్యాపరమైన చర్య మాత్రమే కాదని, ఇది భారత చరిత్ర, సంప్రదాయాలు, సంస్కృతి, భాషలపై ఆరెస్సెస్ చేస్తున్న కుట్ర అని రాహుల్ ఆరోపించారు. తాను ఎప్పటినుంచో దీనిపై మొత్తుకుంటూనే ఉన్నానని ఆయన పేర్కొన్నారు. ‘ఒకే దేశం.. ఒకే చరిత్ర.. ఒకే ఆలోచన.. ఒకే భాష.. ఒకే ఆహారం’ఇలా అన్నింటినీ ఒకే ఫ్రేమ్‌లోకి తేవటమే ఆ సంస్థ లక్ష్యమని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మండిపడ్డారు.
గవర్నర్ల పేరుతో..
వర్శిటీలు, కళాశాలల్లో అధ్యాపకులు, బోధనా సిబ్బంది నియామకం, పదోన్నతి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు రాష్ట్రాల హక్కులను గుంజుకోబోతున్నాయని, ఇకపై వర్సిటీల్లో కేంద్ర పెత్తనం పెరుగుతుందని రాహుల్ ఆరోపించారు. ఇప్పటికే బీజేపీయేతర రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిని నిరసిస్తుండగా, తమిళనాడు, కేరళ వంటివి ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ చట్టసభల్లో తీర్మానం కూడా చేశాయని గుర్తుచేశారు. ఈ చర్యతో రాబోయే రోజుల్లో ఉన్నత విద్యారంగం కార్పొరేట్ల చేతికి చిక్కుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్లను అడ్డుపెట్టుకుని కేంద్రం ఆడే ఈ నాటకాన్ని ఎండగడతామని హెచ్చరించారు.